లౌకిక శక్తులకు ఎన్నికల పాఠాలు

లౌకిక శక్తులకు ఎన్నికల పాఠాలుఅయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను దేశ ప్రజలూ, పార్టీలూ, మీడియా ఇంకా మాట్లాడుకుం టుండగానే ప్రధాని మోడీ కేంద్రంలో హ్యాట్రిక్‌ నినాదం మీడియాలో తీసుకురావడం యాదృచ్చిక మేమీకాదు. తెలంగాణను మినహాయించితే మూడు కీలక హిందీ రాష్ట్రాల గెలుపుతో మరోసారి తన సంఖ్య పెంచుకున్న కాషాయపార్టీ నుంచి ఈ దూకుడు వూహించిందే. బీజేపీ రాజ కీయ వ్యూహాలు, ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసి ప్రజల ముందు తనే బాహు బలిగా ప్రత్యక్షం కావాలనే మోడీ రాజకీ యం గత పది పదిహేనేళ్లుగా దేశం చూ స్తూనే వుంది. అన్ని విధాల వంతపాడే బడా మీడియా, అధికార రాజకీయాలలో మునిగితేలుతూ బీజేపీ హైపర్‌ హిందూత్వ దాడి నుంచి దృష్టి మరల్చే జాతీయ, ప్రాం తీయ, లౌకిక పార్టీల పోకడలూ ఇందుకు తోడవుతుంటాయి. గెలుపు ముందు ఓటమి ఎప్పుడూ వెలవెలబోతుందన్నట్టు విజయం విశ్వరూపంలో కనిపిస్తుంటే పరాజితులను పరాభవించడం పరి పాటి. బహుశా ఈ సన్నివేశంలో ఈ లక్షణం మరిం తగా ఆవిష్కృతమవుతున్నది. పార్లమెంటు సమావే శాల ప్రారంభ ఘట్టంలో మోడీ మాట్లాడుతూ అసెం బ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ప్రతిపక్షాలు ప్రతికూల వైఖరి అనుసరించ తగదని మరోసారి గెలిచే అవకా శాలు ఎప్పుడూ వుంటాయని మనస్తత్వ పాఠాలు ప్రవచించారు. ప్రతిపక్షాల సవాళ్ల నుంచి ఎప్పుడూ పలాయనం చిత్తగిస్తూ దేశం ముందుకొచ్చిన సవాళ్లకు సమాధానమివ్వకుండా ఏకపక్ష ఆధిక్యతతో పార్లమెంటు పనితీరును ప్రహసనంగా మార్చిన ఘనత నిజానికి ఆయనదే.ఇప్పుడు ఇది మరింత ముదురుతుందని తాజా సంకేతాలు చెబుతూనే వు న్నాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత తొలి సమావేశాల్లోనే జమ్మూకాశ్మీర్‌ 370 రద్దు బిల్లు ఆమో దింపచేసుకున్న ఈ ప్రభుత్వం ఈ ముగింపు దశలో అక్కడ రిజర్వేషన్లు అనీ, ఆక్రమిత కాశ్మీర్‌కూ సీట్లు అట్టి పెట్టడం, విముక్తి చేయడమనీ కొత్త నినాదం తీసు కొస్తున్నది. ఇవన్నీ వచ్చే ఎన్నికలకు సన్నాహాలే. అయోధ్యలో ఆలయ ప్రతిష్టాపన, నెహ్రూ తప్పిదా లంటూ దాడి, చరిత్ర పుస్తకాలను మరింత తల కిందులు చేయడం ఇవన్నీ దాని కొనసాగింపే. రాబో యే కాలానికి సంబంధించిన రాజకీయ హెచ్చరికలే ఇవి. ఇదే శీర్షికలో ఇండియా వేదిక, కాంగ్రెస్‌ పోక డలు పేరిట (నవంబర్‌5న) ప్రచురితమైన వ్యాసం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ పరిస్థితికి కారణాలు కనిపిస్తాయి. వివిధ ప్రాంతీయ లౌకిక పార్టీలకూ ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. మోడీత్వ విజృంభించే తరుణం లో ప్రజల తీర్పు పాఠాలను వంటపట్టించుకోవడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం.119 స్థానాలు గల శాసన సభలో 65(సీపీఐ1) సీట్లు గెలిచి తెలంగాణ ముఖ్య మంత్రిగా రేవంత్‌ ప్రమాణస్వీకారానికి నాయకత్వ మంతా తరలి రావడం మినహా ఫలి తాలపై బీజేపీ దూకుడు ఇలా వుంటే కాంగ్రెస్‌ ఇంతవరకూ సమగ్రమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు.
బీఆర్‌ఎస్‌కు గుణపాఠం, రేవంత్‌కు సారథ్యం
తెలంగాణలో కాంగ్రెస్‌ విజ యం సాధిస్తుందనేది ముందుగా అత్యధిక సర్వేలు, వాటికి తారా స్థాయిగా ఎగ్జిట్‌పోల్స్‌ ముందే ఊహించాయి. వాటిని ఏ మేరకు విశ్వసించవచ్చుననేది కూడా ఇక్కడ చర్చించాము. తెలంగాణలో కాస్త అటూఇటూగా నిజమైన ఈ పోల్స్‌ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో విఫలమయ్యాయి. తెలం గాణపై కచ్చితంగా చెప్పిన ఇండియా టుడే కూడా అక్కడ దెబ్బతిన్నది. ఆ సంగతి అలా వుంచితే తెలం గాణలో కేసీఆర్‌ ఏకపక్ష పోకడల పట్ల, ప్రభుత్వ తప్పులపట్ల ఓటర్ల ఆగ్రహం తీవ్రంగానే వుందని ఫలితాలు తేటతెల్లం చేశాయి. ఆఖరుకు ఆయన, రేవంత్‌రెడ్డి కూడా ఒక స్థానంలో ఓడిపోయారు. తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్‌ వీటన్నిటినీ అధిగమిస్తారనే బీఆర్‌ఎస్‌ ఆశలు ఆచరణలో కుప్ప కూలాయి. సెంటిమెంటు, సంక్షేమ పథకాల ప్రభా వం పల్లెల్లో అధికంగా వుంటుందనే అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఎందుకంటే హైదరా బాద్‌, రంగారెడ్డిలో కాంగ్రెస్‌ సీట్లు తెచ్చుకోలేక పోయింది. ఉత్తర తెలంగాణలో అధికంగానూ, దక్షిణ భాగంలో పూర్తిగానూ దాని విజయాలు లభించాయి. ఉత్తర భాగంలో బీజేపీ కూడా మంచి ఫలితాలే సాధించింది. వాస్తవానికి బీజేపీతో బీఆర్‌ఎస్‌ రాజీ పడటం, ఉభయులూ కలసి కాంగ్రెస్‌ను రాకుండా చేయడం కోసం వారి మధ్య తెర వెనక దోస్తీ వుందనే బలమైన అభిప్రాయం తీర్పును చాలావరకూ ప్రభావితం చేసింది. మునుగోడులో వామపక్షాల మద్దతుతో బీజేపీ ని ఓడించిన తర్వాత తెలంగాణ రాజకీయ దృశ్యం మారింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మోడీపై తీవ్ర విమర్శలే కురిపించారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ పాత్ర నిర్వహిస్తామన్నారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య సమ దూరం సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. మహా రాష్ట్రలో రాజకీయ హడావుడి చేశారు. (గత ఎన్నికల తరుణంలోనూ దేశ్‌కీ నేతా నినాదం తోనే ఓటర్ల ముందుకు వెళ్లారని గుర్తుంచు కోవాలి.) కానీ ఇవన్నీ ఒక్కసారిగా ఆపేశారు.
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితపై దర్యాప్తు, నోటీ సుల తర్వాత కెేసీఆర్‌ వెనక్కు తగ్గారనే భావం బలం గా వ్యాపించింది. కమ్యూనిస్టులతో పొత్తు వుంటుం దనే సూచనలను మొదట ఇచ్చిన ఆయన తర్వాత తనే వాటిని ఏకపక్షంగా వమ్ముచేయడానికి కూడా ఇదే కారణమైందని అభిప్రాయమేర్పడింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ మత రాజకీయాలు, కేంద్రీ కృత పెత్తనంపై పోరాటం కంటే రాష్ట్రాధిపత్యం కోసం తమలో తమ పోటీనే ముందుకు తెచ్చారు. బీజేపీ ఇక్కడ శక్తికాదనే వాదన చేశారు. అవతలివారే బీజేపీతో కలసిపోయారని ఆరోపణలు చేశారు. రేవంత్‌ రెడ్డి ఏబీవీపీ నేపథ్యం గురించి బీఆర్‌ఎస్‌ చెప్పింది. కవితను అరెస్టు చేయకపోవడం,మేడిగడ్డ పిల్లర్‌ కుంగుబాటుపై కేంద్ర దర్యాప్తు జరిపించక పోవడం, సిబిఐ దాడులు లేకపోవడం కుమ్మక్కు వల్లనేనని కాంగ్రెస్‌ కేంద్ర, రాష్ట్ర నాయకులు విమ ర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్‌ మిగిలినచోట్ల వలెనే వామపక్షాల విషయంలో అవాస్తవిక వైఖరి అనుసరించింది. ఇవన్నీ ఫలితాలలో ప్రతిబింబిం చాయి. సీపీఐ ఒక్కస్థానంతో సర్దుబాటు చేసుకుని విజయం సాధించింది. (గత రెండు ఎన్నికల్లో కూడా సీపీఐ, కాంగ్రెస్‌ కలిసే పోటీ చేశాయి) ఆహ్వానం వస్తే మంత్రివర్గంలో చేరే విషయం పరిశీలిస్తామని సాను కూల సూచనలు ఇచ్చింది కానీ ఇప్పటికైతే ఆ దిశలో అడుగులు పడలేదు. సీపీఐ(ఎం) స్వంతంగా పోటీ చేసింది. సీపీఐకి మద్దతునిచ్చింది. అది ఎక్కడా విజయం సాధించకపోవడం, ఓట్లు బాగా తక్కువగా రావడం ఉద్యమాభిమానులకు నిరుత్సాహం కలిగిం చింది. వీటిపై సమీక్ష చేసుకుంటామని, ఎప్పటిలా గానే ప్రజల కోసం పోరాడతామనీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తూనే ప్రజల తీర్పును సరిగ్గా అర్థం చేసుకుని సరైన పాలన అందించాలని సూచించారు.ఈ సంద ర్భంలో రాజకీయ నేపథ్యాన్ని రూ.వందల కోట్లతో నడిచిన ఎన్నికల రాజకీయాన్ని విస్మరించి కమ్యూని స్టులను చులకన చేస్తూ మాట్లాడటం దారితప్పి స్తుంది. బీజేపీ కూడా 13.9 శాతం ఓట్లు,8 సీట్లు పొంది ఒక శక్తిగా వచ్చింది. నిజానికి 2019 పార్ల మెంటు ఎన్నికలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ కాగా గత అసెంబ్లీ ఎన్నికల కంటే బాగా ఎక్కువ. ఈ దఫా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య ఓట్ల తేడా రెండు శాతంలోపు వచ్చింది. మజ్లిస్‌ తన ఏడు స్థానాలు నిలబెట్టుకుంది. ఇరు పక్షాల మధ్య తేడా తొమ్మిదే గనక ఆరు నెలల్లో అంతా మారిపోతుందనే ప్రచారం వివిధ రూపాల్లో సాగుతూనే వుంది. విజయానికి నాయకత్వం వహించిన రేవంత్‌రెడ్డి సహజంగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా అంతర్గత ఐక్కత, శాసనసభలో సవాళ్లు తీవ్రంగానే వుంటాయ నడం నిస్సందేహం.మూడు మాసాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతనే రాజకీయ పరిస్థితి ఒక కొలిక్కి వస్తుందని విస్త్రత చర్చ జరుగుతున్నది. ఫిరా యింపులతో కేసీఆర్‌ బలం విపరీతంగా పెంచుకున్న గత పద్ధతులు పునరావృతం కాబోవని, కాంగ్రెస్‌ నాయకులు బాధ్యతగా వ్యవహరించి ప్రజల తీర్పును సార్థకం చేసుకుంటారని ఆశించాలి. అయితే కొంత మంది ఈ కారణంగా చులకన చేస్తూ మాట్లాడటం మాత్రం సరికాదు. బీజేపీ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ రేవంత్‌ ప్రభుత్వం ఆరునెలల్లో పడిపోతుందని బెది రించడం మాత్రం దారుణం,అప్రజాస్వామికం. తీర్పు ను స్వాగతిస్తామని బీఆర్‌ఎస్‌ చెబుతున్నా అటూ ఇటూ అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. రేవంత్‌ విజయం వెనక తెలుగుదేశం ప్రధానంగా వుందని ఒక ప్రచారం జరిగినా తమకేమీ సంబంధం లేదని ప్రకటించింది. టీడీపీ మిత్రపక్షం, ఎన్‌డిఎ భాగ స్వామి జనసేన బీజేపీతో కలిసి ఎనిమిది చోట్ల పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. అక్కడ టీడీపీ ఇక్కడ బీజేపీ అనే ప్రశ్న ఒకటి రాగా టీడీపీ వరకూ కాంగ్రెస్‌ తో తాము లేమన్న సందేశం బీజేపీకి చేర్చడానికి జాగ్రత్త పడుతున్నది. ఈ ఎన్నికల ఫలితాలపై రాజ కీయ పరిణామాలపై మరింత వివరమైన చర్చ మున్ముందు తప్పక జరపాల్సి వుంటుంది.
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోనూ కొత్త ప్రాంతీయ పార్టీ జెడ్‌పిఎం అధికారం చేపట్టింది, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి లాల్‌ధూమా ఏ కూటమి లోనూ చేరేయోచనలో లేరు. ఇక రాజస్థాన్‌ చేజారు తుందనుకున్నా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీయే ఊహిం చిన దానికన్నా ఎక్కువ విజయం సాధించింది. ఇందుకు దారితీసిన రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ ఒంటెత్తుపోకడల గురించి పీపుల్స్‌ డెమోక్రసీ తాజా సంపాదకీయం సమగ్రంగానే విశ్లేషించింది, హెచ్చ రిస్తున్నది కూడా. అయితే ఛత్తీస్‌గఢ్‌, ఎంపీలలో తమ వాళ్ల మధ్య తగాదాల గురించి నాయకుల తేడాల గురించి మాత్రమే కాంగ్రెస్‌ చర్చ ఎక్కువగా నడుస్తున్నది. రాజస్థాన్‌ లో ఓటమి రావచ్చని భావించినా తీవ్రత చాలా ఎక్కువగా వుంది. 17 మంది మంత్రులు ఓడిపో యారు. మధ్యప్రదేశ్‌లో ఫిరాయిం పులతో తిరిగొచ్చిన బీజేపీ ముఖ్య మంత్రి శివరాజ్‌ చౌహాన్‌ హిందూ త్వ రాజకీయాలనూ కొన్ని పథకా లను ఆధారం చేసుకుని గెలుపొం దారు. కాంగ్రెస్‌ మాజీ ముఖ్య మంత్రి కమల్‌నాథ్‌ కూడా బీజేపీ నమూనాను అనుకరించబోయి రెండు విధాలా భంగపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ మాత్రం గెలుస్తామను కుని దారుణ ఓటమి పాలైంది కాంగ్రెస్‌. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆదివాసీ ప్రాంతాలలో ఎస్‌టి సీట్లలో బీజేపీ చాలా పట్టు సాధించడం ప్రత్యేకించి ఆందోళన కరం. ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య 1997, 2003, 2018 ఎన్నికలలో శాసన సభ, లోక్‌సభ ఫలితాలు తారుమారయ్యాయి. ఇప్పుడు ఓట్ల సంఖ్య కూడా బీజేపీ కూటమి కన్నా ఇండియాలో భాగస్వాములైన వారికే ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు. 12.29 కోట్ల ఓట్లు పోలవగా బీజేపీ కూటమికి 4.82 కోట్ల ఓట్లు, కాంగ్రెస్‌కు 4.92కోట్ల ఓట్లు, ఇండియాలో భాగస్వాములైన వాటికి మొత్తంగా 5.06కోట్ల ఓట్లు వచ్చాయి.వీటి ఆధారంగా నిపుణులు ఏవో లెక్కలు కడుతున్నారు గానీ నిజంగా జరగాల్సింది కాంగ్రెస్‌ ధోరణిలో మార్పు. ‘ఇండియా’ వేదికను సక్రమంగా నిర్వహిం చడం. రాజకీయంగా సైద్ధాంతికంగానే గాక ఓట్ల చీలిక నివారించేందుకు కృషి చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల పోరాటం సరైన ఫలితాలిస్తుంది.
తెలకపల్లి రవి