ఎలక్షన్‌ స్టంట్‌

Election stunt–  వంటగ్యాస్‌ ధర రూ.200 తగ్గింపు.. కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం
మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరం శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వంట గ్యాస్‌ ధరను సిలిండర్‌పై 200రూపాయలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైనప్పటికీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా గ్యాస్‌ ధరల తగ్గింపు నిర్ణయాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మంగళ వారం జరిగిన క్యాబినెట్‌ సమావేశం అనంతరం… నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసీ)లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. విలేకరులతో మట్లాడిన మంత్రి ఓనం, రక్షా బంధన్‌ కానుకుగా గ్యాస్‌ ధరలను తగ్గించినట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల
యోజన (పిఎంయువై) వినియోగదారులకూ ఈ తగ్గింపు వర్తించనున్నదని, ప్రస్తుతం ఉన్న సబ్సిడీతో పాటు మొత్తంగా రూ.400 తగ్గింపు లభిస్తుందని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా 33 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులకు లబ్ధి కలుగుతుందని కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.7,680 కోట్ల ఆర్థిక భారం పడనున్నట్టు వెల్లడించారు. కాగా, కేంద్రం అధికారంలోకి వచ్చాక.. గ్యాస్‌ ధరలను భారీగా పెంచింది. జులైలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.50 పెంచిన విషయం తెలిసిందే. మే నెలలో రెండుసార్లు పెంచారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అధికారిక సమాచారం ప్రకారం, 2021 ఫిబ్రవరి 4న రూ.25 పెంపుదలకు ముందు వంటగ్యాస్‌ ధర సిలిండర్‌కు రూ.694గా ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని రిఫైనర్లు 2021 నుంచి వంట గ్యాస్‌ ధరలను 13 సార్లు పెంచారు. అయితే అసలు బీజేపీ సర్కారు గ్యాస్‌ ధర పెంచింది ఎంత.. తగ్గించింది ఎంత అన్నది ఇప్పుడు చర్చనీయాం శంగా మారింది. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.410 మాత్రమే. అందులో కూడా పేదలకు కొంత సబ్సిడీ లభించేది. ఇప్పుడు 2023లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1053కి చేరింది. అంటే ఈ పదేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్‌ రేటు దాదాపు 115 శాతం పెరిగింది. పైగా బీజేపీ ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీని దాదాపు పూర్తిగా తగ్గించింది. మొన్నటిదాకా గ్యాస్‌ రేట్లు తగ్గించాలని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్‌ చేస్తే అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారమే ధరలు పెంచామని బీజేపీ నేతలు కల్లబొల్లి మాటలు చెప్పారు. ఇప్పుడేమో ఎన్నికల ముంగిట తాము పెంచినదాంట్లో కొంచెం తగ్గించి మహిళలనుద్ధరించినట్టు చెప్పుకుంటు న్నారు. అందుకే ఈ సర్కారు తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్లేషకులు ఇదొక ఎన్నికల స్టంట్‌గా పేర్కొంటున్నారు. ప్రజలు ఇది నమ్మి ఓటు వేస్తే ముందుముందు సిలిండర్‌ ధర రెండువేలు దాటినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నారు.
చంద్రయాన్‌-3 చారిత్రాత్మక విజయంపై కేంద్ర మంత్రి వర్గం తీర్మానం
చంద్రునికి చంద్రయాన్‌-3 మిషన్‌ చారిత్రా త్మక విజయాన్ని జరుపుకోవడం కోసం కేంద్రమంత్రి వర్గం తీర్మానం ఆమోదించింది. అలాగే శాస్త్రవేత్తల స్మారక విజయాన్ని మంత్రివర్గం అభినందించింది. ఇది మన అంతరిక్ష సంస్థకు మాత్రమే విజయం కాదనీ, ప్రపంచ వేదికపై భారతదేశం పురోగతికి ప్రకాశవంతమైన చిహ్నమని పేర్కొంది. చంద్రయాన్‌-3 విజయవంతమైన ఆగస్టు 23 ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా జరుపుకోవడాన్ని మంత్రివర్గం స్వాగతించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషికి అభినందనలు తెలిపింది. సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ల ఈ యుగంలో మరింత మంది యువకులను సైన్స్‌ వైపు ప్రేరేపించాలని విద్యా ప్రపంచంతో అను బంధానానికి కేంద్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది.