అర్హులైన వృత్తుల వారు పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

 –  జిల్లా వ్యాప్తంగా  11 వేల దరఖాస్తులు
 – టెక్స్ టైల్స్ కు  అవకాశం ఉన్నందున నేత కార్మికులు దృష్టి సారించవచ్చు 
 – కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్
ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం కింద అర్హులైన వృత్తుల వారందరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ లోని  ఉదయాదిత్య భవన్ లో ప్రదాన మంత్రి విశ్వకర్మ పథకం పై జిల్లా పరిశ్రమల శాఖ నిర్వహించిన ఒక రోజు సెమినార్,అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ పథకం  ఉపయోగకరమైనదని, ముఖ్యంగా కులవృత్తి చేసుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకం కింద  కేవలం 5 శాతం తక్కువ వడ్డీకి రుణం పొందవచ్చని, సబ్సిడీ సైతం  ఉంటుందని, వివిధ వృత్తులు చేసుకునే వారికి శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్ తో పాటు, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇదివరకే కులవృత్తి చేసుకునేవారు వారి వృత్తిలో నిరంతరం కొనసాగడమే కాకుండా వారి నైపుణ్యాలను ఇంకా పెంపొందించుకోవచ్చని అన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద జిల్లాలో సుమారు 11,000 మంది నమోదు చేసుకున్నారని, జిల్లా, మండలం, గ్రామీణ స్థాయిలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. నల్గొండ జిల్లాలో టెక్స్ టైల్ కు మంచి అవకాశం ఉన్నందున దానిపై నేత కార్మికులు దృష్టి సారించవచ్చని అన్నారు. మొదటిసారి లక్ష రూపాయల  వరకుఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణం   పొందవచ్చని,తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే  తిరిగి ఎక్కువ మొత్తంలో రుణం  తీసుకొనే  అవకాశం ఉందని, అందువల్ల అర్హులైన వృత్తుల వారందరూ ఈ పథకం కింద నమోదు చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఎం ఎస్ ఎం ఈ  కో-ఆర్డినేటర్ నవీన్ ,మెప్మా పీడీ కరుణాకర్, మహిళాశిశు  సంక్షేమ అధికారిని సక్కుబాయి, 18 కులవృత్తుల సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.