అంతుచిక్కకుండా ప్రజా తీర్పు : మురళీధర్‌రావు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో రాజకీయ విశ్లేషకులు, సెఫాలజిస్టులకు అంతుచిక్కని విధంగా ప్రజా తీర్పు ఉండబోతున్నదనీ, బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తమ పార్టీనే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం క్రీడాకారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించడం వల్లనే ఆసియా గేమ్స్‌లో 107 పతకాలతో దేశం రికార్డు సృష్టించిందన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో జరుగుతున్న అవినీతినీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుటుంబ పార్టీలనీ, వాటిని ప్రజలు అస్సలు నమ్మరని చెప్పారు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్‌ ఏర్పాటు ఆలస్యానికి సీఎం కేసీఆర్‌ తీరే కారణమని విమర్శించారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలని కాంగ్రెస్‌ చూస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు.