నిజాయితీకి పట్టం కట్టండి

Embrace honesty– ప్రజాసమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్దులను గెలిపించండి
– సీపీఐ సోదరులు, వామపక్ష శక్తులు మద్దతివ్వాలి
– సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నిజాయితీపరులకే పట్టం కట్టాలని, అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడే తమ్మినేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ(ఎం) రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు కోరారు. పాలేరు సీపీఐ(ఎం) అభ్యర్థి తమ్మినేని వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంరూరల్‌ మండలంలోని ఏదులాపురం గ్రామంలో ప్రచారానికి మధు హాజరయ్యారు. ఏదులాపురం, ఆదిత్యనగర్‌, ఓరుగంటి నగర్‌, వెంపటి నగర్‌, సింహాద్రి నగర్‌, మారుతీ నగర్‌, ఆటో నగర్‌, సాయి బృందావనం కాలనీల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లు కావడంతో డబ్బు సంచులతో ప్రజలను ప్రలోభ పెట్టి గెలిచేందుకు వస్తున్నారని, అలాంటి వారి మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. తమ్మినేని 50 ఏండ్ల నుంచి పట్టిన జెండా విడవని నిజాయితీపరుడని, అలాంటి వ్యక్తికి మీ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. సీపీఐ సోదరులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తోటి సోదర వామపక్ష రాష్ట్ర కార్యదర్శి పాలేరులో పోటీ చేస్తున్నారని, మీ ఓట్లు తమ్మినేనికి వేయాలని సీపీఐ శ్రేణులను కోరారు. సీపీఐ(ఎం) పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. వామపక్ష సోదరులు, అభ్యుదయవాదులు, లౌకిక శక్తులు సుత్తి కొడవలి నక్షత్రంపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తన విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 25న యం.వెంకటాయపాలెంలో జరిగే బహిరంగ సభకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వస్తున్నారని, మండలంలోని వామపక్షశక్తులు ఈ సభకు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేష్‌, షేక్‌ బషీరుద్దీన్‌, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌, మండల ఇన్‌చార్జి ఊరడి సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.