సాధారణంగా భావోద్వేగాల గురించి మాట్లాడినప్పుడు లేదా ఆలోచించినప్పుడు వాటి దుష్ప్రభావాలపై మాత్రమే దృష్టిపెడతాం. ఎమోషనల్‌గా ఉంటే వారు బలహీనులు అనే భావన ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలను భావోద్వేగపరులు అంటూ వారిని బలహీనులుగా అభివర్ణిస్తుం టారు. కానీ ఈ వ్యాసంలో నేను భావోద్వేగాలు, హార్మోన్ల సానుకూల అంశాల గురించి చర్చించాలను కుంటున్నాను. భావోద్వేగాల ప్రాముఖ్యత, అవి కలిగించే ప్రయోజనాలు, మన ఆరోగ్యంపై అవి చూపించే సానుకూల ప్రభావాలు, మన శరీరంలోని హార్మోన్లపై వాటి ప్రభావం తదితర విషయాలను మానవి పాఠకులకు తెలియజేయాలను కుంటున్నాను.
ఉమెన్ హెల్త్
మనం సంతోషంగా, సానుకూలంగా ఆలోచించినప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మన శరీరంలో పలు సానుకూల మార్పులను కలిగిస్తాయి. ఉదాహరణకు ఆక్సిటోసిన్ శరీరానికి విశ్రాంతిని అందించడంతో పాటు అనుబంధం, సంతోషం, ప్రేమ వంటి భావోద్వేగాలను పెంపొందిస్తుంది. ఎండార్ఫిన్స్ మానసిక ఆందోళనను తగ్గించి, మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది. అలాగే మన లక్ష్యాలను సాధించినప్పుడు లేదా టార్గెట్లను పూర్తి చేసినప్పుడు డోపమైన్ అనే న్యూరోపెప్టైడ్ విడుదల అవుతుంది. ఇది మనకు సంతృప్తిని కలిగించే హార్మోన్. డోపమైన్ మానసిక ఉల్లాసాన్ని, ఫోకస్‌ను మెరుగుపరుస్తుంది.
ఆందోళనను తగ్గిస్తుంది
మనకు ఇష్టమైన రంగుల బట్టలు ధరించినప్పుడు ముఖ్యంగా పింక్ లేదా లావెండర్ కలర్‌తో మన శరీరంలో మెలటోనిన్ విడుదల అవుతుంది. ఇది మనకు గాఢ నిద్రను అందించడంలో సహాయపడుతుంది. అదే విధంగా ఆందోళనను తగ్గిస్తుంది. ఇంకా మనకు ఇష్టమైన వంటలు చేసుకున్నప్పుడు లేదా మన కుటుంబ సభ్యులకు ఇష్టమైన వంటలు చేసినప్పుడు, శరీరంలో విడుదలయ్యే న్యూరోపెప్టైడ్లు మనకు సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి. మనకు ఇష్టమైన వ్యక్తులను కౌగిలించుకున్నప్పుడు మనకు రక్షణ, సురక్షితమైన అనుభూతి కలుగుతుంది. ఇది మన ఆందోళనను తగ్గించి, నెగిటివ్ భావోద్వేగాలను తగ్గిస్తుంది. రక్తపోటు కూడా తగ్గిస్తుంది.
ప్రతి కణంపై ప్రభావం
మన శరీరంలో భావోద్వేగాలకు సంబంధించిన అనేక మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్ మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపుతాయి. ప్రఖ్యాత న్యూరోసైంటిస్ట్ డా. కాండేస్ పర్ట్ రాసిన ‘మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్స్’ అనే పుస్తకం ఈ అంశంపై లోతుగా చర్చిస్తుంది. ప్రతి ఒక్కరు చదవవలసిన పుస్తకమిది. ఇదే సమయంలో ఈ వ్యాసం మహిళలకు ప్రధానంగా ఉద్దేశించబడినందున వారికి సంబంధించి కొన్ని హార్మోన్ల ప్రభావాలను వివరించాలి. ముఖ్యంగా రుతుచక్ర సమయంలో, ఎస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు విడుదలై వాటి స్థాయిల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇవి మహిళల భావోద్వేగాలపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి.
సానుకూలంగా మార్చుకోవడం
మన భావోద్వేగాలను మనం సానుకూలంగా ఎలా మార్చుకోవాలి? ఆనందాన్ని, ప్రశాంతతను పొందేందుకు మన శరీరంలో సహజసిద్ధంగా జరిగే ఈ హార్మోన్ల ప్రభావాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మన ఆలోచనలు, పనులు, ప్రవర్తన సానుకూలంగా ఉంటే, శరీరం కూడా అదే పద్ధతిలో స్పందిస్తుంది. భావోద్వేగాలు మన ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి. రాబోయే వ్యాసాల్లో, ఈ సానుకూల భావోద్వేగాలను ఇంకా మెరుగ్గా ఎలా పెంపొందించుకోవచ్చో చర్చిస్తాను.
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM;
CCGDM; NLP; FID
Award winning Holistic Health Physician; 12+ years of Experience; 10000+ patients treated.
8897684912/040-49950314