నవతెలంగాణ- తుంగతుర్తి
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో శనివారం వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కూలీ కొండ వీరస్వామి (75) గ్రామ సమీపంలోని అవుసలోని కుంటలో ఉపాధి పనికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తోటి కూలీలు వీరస్వామికి సపర్యలు చేస్తుండగానే మృతిచెందాడు. పనిప్రదేశంలో టెంట్, నీటి సౌకర్యం కల్పించడం లేదని, ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యం వల్లే వీరస్వామి మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపించారు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.