ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతుల్ని ప్రోత్సహించండి

– రాయితీలన్నింటినీ అందిద్దాం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 32 జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూల పరిస్థితులున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అందువల్ల ఆ పంటను వేసేందుకు వీలుగా రైతులను ప్రోత్సహించాలంటూ ఆయన అధికారులకు సూచించారు. వారికి ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వాల్సిన రాయితీలన్నింటినీ అందిస్తామని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ఎంపిక చేసిన జిల్లాలకు ఇతర జిల్లాల్లోని నర్సరీల నుంచి మొక్కలు తెప్పించాలని కోరారు. ఇప్పటికే 11 వేల ఎకరాల్లో మొక్కలు నాటటం పూర్తయిందనీ, మొత్తం 75 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలను నాటుకోవటానికి రైతులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వివరించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలనీ, ముఖ్యంగా స్వల్పకాలిక పంటల సాగుపై వారికి చైతన్యం కల్పించాలని కోరారు. శాస్త్రవేత్తల సూచన ప్రకారం కంది, పత్తి పంటలను మరో వారం రోజుల వరకూ విత్తుకోవచ్చని వివరించారు. మొక్కజొన్న పంట సాగుకు ఈ నెలాఖరు వరకూ వాతావరణం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఆశాజనకంగానే ఉందని తెలిపారు. వర్షాలు కాస్త ఆలస్యమైనా సాగుకు సహకరిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.