ఈ ఏడాది నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లీష్‌

– 24 లక్షల మంది విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు : విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
– రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో బాడిబాట
– విద్యార్థులకు అక్షరాభ్యాసం, పలకల పంపిణీ
నవతెలంగాణ-మహేశ్వరం
ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన సాగిందని, ఈ ఏడాది 9వ తరగతి కూడా ఇంగ్లీష్‌ మీడియంలో బోధించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు అందివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. నోట్‌ పుస్తకాలకు ప్రభుత్వం రూ.60 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాఠశాలల పున్ణప్రారంభం సందర్భంగా మొదటి రోజు హాజరైన విద్యార్థులకు మంత్రి స్వాగతం పలికి అభినందించారు. నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు పలకలు పంపిణీ చేసి, అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు తొలి మెట్టు కార్యక్రమం ద్వారా సులువుగా అర్థం అయ్యేలా బోధిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవటానికి ఇంగ్లీష్‌ మీడియం కారణం అవటంతో పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు పోటీ పడేలా ఉండాలని గతేడాది నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ బోధన ప్రారంభించినట్టు తెలిపారు. ఈ సంవత్సరం 9వ తరగతి వరకు బోధించనున్నట్టు వివరించారు. ఏ ఆటంకం లేకుండా ఈ విద్యా సంవత్సరం కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.
గతేడాది పాఠ్య పుస్తకాల పంపిణీకి రూ.132 కోట్లు ఖర్చు చేయగా, ఈ విద్యా సంవత్సరానికి రూ.200 కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. దాదాపు రూ.150 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున యూనిఫామ్‌ను ఈ నెల 20న జరిగే విద్యా దినోత్సవం సందర్భంగా అందివ్వన్నుట్టు తెలిపారు. రూ.35 కోట్లతో ఉదయం పూట విద్యార్థులకు రాగి జావా అందిస్తున్నట్టు చెప్పారు. పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్స్‌కు తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వర్క్స్‌ బుక్స్‌ను, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను ఉచితంగా అందజేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా 12 విభాగాల్లో పనులు పూర్తి అయిన 1000 పాఠశాలలను విద్యా దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. హరితహారంలో భాగంగా పాఠశాలల వద్ద మొక్కలు నాటలన్నారు. గుడి లాగే బడినీ చూడాలన్నారు. స్థానిక సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.