– సమ్మర్ క్యాంప్ తో పిల్లల్లో మానసికోల్లాసం
– జవహర్ బాలభవన్ డైరెక్టర్ రమణకుమార్
– బాలల పెయింటింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో గల జవహర్ బాలభవన్ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో ఆట, పాటల వల్ల పిల్లల్లో మానసిక ఉల్లాసంతో పాటు సృజనాత్మకత పెరుగుతున్నదని ఆ సంస్థ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. గురువారం జవహర్ బాలభవన్‌లో క్రియేటివ్ ఆర్ట్ సెక్షన్ ఉపాధ్యాయులు కప్పారి కిషన్ ఆధ్వర్యంలో ఆ విభాగం విద్యార్థులు ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్న చిన్నారులు ఏడాదికి సరిపడా శక్తిని కూడగట్టుకుంటున్నారని తెలిపారు. పెయింటింగ్ విద్యార్థులు బయట ఒక దృశ్యాన్ని చూస్తే వెంటనే ఒక ఐడియాతో ముందుకెళ్లేలా నైపుణ్యం సంపాదించుకుంటున్నారని తెలిపారు. పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆకట్టుకున్న పెయింటింగ్ ప్రదర్శన
ఒకటో తరగతి నుంచి పైతరగతులు చదువుతున్న విద్యార్థులు సమ్మర్ క్యాంపులో వేసిన పెయింటింగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రకృతి, మానవ సంబంధాలు, మనుషుల అవసరాలకు వాడే పరికరాలు, సమాజంలో కనిపించే అనేక దృశ్యాలు, కుటుంబ జీవనం తదితర అంశాలను ఇతివత్తంగా విద్యార్థులు వేసిన పెయింటింగ్స్‌ను ఆహుతులు తిలకించారు. ఆయిల్ పేస్టిల్స్, కలర్ పెన్సిళ్లు, అక్రిలిక్స్, పెన్సిల్ షేడింగ్, మిక్స్ మీడియాతో తమదైన శైలిలో వేసిన పెయింటింగ్స్ అందర్ని అబ్బురపరిచాయి. డైరెక్టర్‌తో పాటు బాలభవన్ బోధనా సిబ్బంది, తల్లిదండ్రులకు పిల్లలు వేసిన పెయింటింగ్స్ వాటి కాన్సెప్ట్, నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల ఉపాధ్యాయులతో పాటు పలువురు సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.