సమాన పనికి సమాన వేతనమివ్వాలి

Equal pay for equal work– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి : జె.వెంకటేశ్‌
– హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనమివ్వాలనీ, వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని కలెక్టరేట్‌ ఎదుట ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు జె.కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 40 శాఖల్లో సుమారు 1,40,000 మంది పనిచేస్తున్నారన్నారు. అనేక శాఖల్లో రెన్యూవల్స్‌ చేయకపోవడంతో సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందటం లేదని వాపోయారు. అరకొర వేతనాలతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జీఓ నెం.60 విడుదలై రెండేండ్లు దాటినా అమలుకు నోచుకోవడంలేదన్నారు. 20 ఏండ్ల నుంచి అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కనీస వేతనంతో పాటు డిఏ, హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయాలన్నారు. 2023 జులై నుంచి ప్రభుత్వోద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కొత్త వేతనాలివ్వాలని డిమాండ్‌ చేశారు. అందర్నీ పీఆర్సీ జీవో పరిధిలోకి తేవాలని కోరారు. రెన్యూవల్‌ కాని 200 మంది పాలిటెక్నిక్‌ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది సమస్యల్ని పరిష్కరించాలనీ, తొలగించిన 23 మందిని విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలనీ, తొలివారంలోనే జీతాలివ్వాలని కోరారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల దీర్ఘకాలిక సర్వీస్‌ను పరిగణలోకి తీసుకొని రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు.