బీఆర్‌ఎస్‌ నుండి వలసల వరస.. మారుతున్న సమీకరణాలు..

– ‘సిట్టింగు’ల్లో ఆందోళన
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికార బి ఆర్‌ఎస్‌ నుండి వరుస వలసలు పెరుగు తున్నాయి. మొన్నటి వరకు పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, పరకాల, మహబూ బాబాద్‌ నియో జకవర్గాల్లో వలసలు ప్రారంభం కావడం రాజకీయ సమీకరణల్లో భారీ మార్పులకు శ్రీకారం చుడుతుంది. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ ఎండి అజీజ్‌ఖాన్‌తోపాటు మాజీ కార్పొరే టర్లు అబూ బాకర్‌, సుంచు అశోక్‌లు కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోగా తాజాగా మంత్రి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో సైతం వలసలు ప్రారంభమయ్యాయి. కాకిరాల హరిప్రసాద్‌తోపాటు పలువురు సర్పంచ్‌లు శనివారం రాత్రి టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. బిఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కువగా పార్టీని వీడడం సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఆందోళనకు గురిచేస్తుంది. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో త్వరలోనే కార్పొరేటర్లను సైతం పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతు ండడంతో రోజుకో ట్విస్ట్‌తో రాజకీయాలు వేడెక్కు తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికార బిఆర్‌ఎస్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు వీడుతుండడం బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తుంది. తొలుత జిల్లాలో పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలలో వలసలుండవని భావించగా, తీరా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వలసలు కాంగ్రెస్‌లోకి పెరుగుతు ండడంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారు తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలోనే బిఆర్‌ఎస్‌ను పలువురు నేతలు వీడడం గమనార్హం. తొర్రూరుకు చెందిన డిసిసిబి డైరెక్టర్‌ కాకిరాల హరిప్రసాద్‌తోపాటు రాగన్నగూడెం సర్పంచ్‌ రెంటాల గోవర్ధన్‌రెడ్డి, ఊకల్లు సర్పంచ్‌ కుంచారపు హరినాధ్‌, సోమారం సర్పంచ్‌ తమ్మడపల్లి సంపత్‌లు బిఆర్‌ఎస్‌ను వీడి టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతక్రితం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఛీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌కు అత్యంత సన్నిహితుడు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ ఎండి అజీజ్‌ఖాన్‌, మాజీ కార్పొరేటర్లు అబూ బాకర్‌, సుంచు అశోక్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రోజుకో ట్విస్ట్‌తో రాజకీయాలు వేడెక్కాయి. పరకాల నియోజక వర్గంలోనూ అనూహ్యంగా వలసలు పెరిగాయి. ఆత్మకూరు ఎంపిపి, జడ్పీటిసి, పరకాల జడ్పీటిసి, సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. త్వరలో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోనూ వలసలు ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతుంది.
‘పశ్చిమ’, ‘తూర్పు’లో మార్పులు
గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి వలసలు పెరిగే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ‘పశ్చిమ’లో బిఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభం కావడం తెలిసిందే. త్వరలోనే ‘తూర్పు’లో వలసలు ప్రారంభం కానున్నాయి. ‘నాయిని’తో పలువురు కార్పొరేటర్లు టచ్‌లో వున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ‘తూర్పు’లో కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ ఒక పర్యాయం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆక్రమంలో కార్పొరేటర్లతో ‘కొండా’ దంప తులకు సన్నిహిత సంబంధాలున్నాయి. పలువురు కార్పొరేటర్లు పార్టీ మారడానికి సిద్ధంగా వున్నట్లు తెలు స్తుంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపనేని నరేందర్‌ పట్ల తీవ్ర వ్యతిరేకతతో వున్న కార్పొరేటర్లు గతంలో రెండుసార్లు సమావేశాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ విషయంలో పార్టీ అధిష్టానం మందలింపుతో ‘నన్నపనేని’ కార్పొరేటర్లతో చర్చలు జరిపినా, పలువురు నేటికీ దూరంగానే వుండడం గమనార్హం.
కార్పొరేటర్ల కట్టడికి తీవ్ర యత్నాలు
మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఐదు నియోజక వర్గాలుండగా ప్రధానంగా వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోనే అత్యధి కంగా కార్పొరేటర్లున్నారు. దీంతో కార్పొరేటర్లు పార్టీ వీడకుండా బిఆర్‌ఎస్‌ అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్యాకేజీలు సిద్ధం చేసి పంపిణీ చేయడం ద్వారా వలసలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ‘సిట్టింగ్‌’లపై పలు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతు ండడంతో బిఆర్‌ఎస్‌ను వీడడానికి స్థానిక ప్రజాప్ర తినిధులు వెనుకాడడం లేదు. ఎమ్మెల్యేలు తమ పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఇప్పటి వరకు గుంభనంగా వున్న నేతలు ఇప్పుడు బయటకు వస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించి నిధులు, విధులకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరూ, ఎప్పుడు పట్టించు కోకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో వున్న నేపథ్యంలోనే భారీగా ఇతర పార్టీలోకి వలస పోతు న్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.