గెలిచినా.. ఢిల్లీకి కష్టమే..

గెలిచినా.. ఢిల్లీకి కష్టమే..– ఓటమితో లక్నో ఆశలూ ఆవిరి
న్యూఢిల్లీ: ప్లే-ఆఫ్‌కు చేరడం కష్టమే అయినా.. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి చిగురాశలతో మిగతాజట్ల ఫలితాలకు వేచిచూస్తోంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ 19 పరుగులు తేడాతో గెలిచి ఈ సీజన్‌లో 7వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మొత్తంగా 14 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఢిల్లీ 14పాయింట్లతో ప్రస్తుతానికి పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 14 పాయింట్లు సాధించిన జట్లతో పోటీపడినా ఢిల్లీ (-0.482) రన్‌రేట్‌ అన్ని జట్లకంటే తక్కువగా ఉంది. పైగా మరికొన్ని జట్లుకు 14 పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో ఢిల్లీ ప్లేఆఫ్‌ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు ఓడిన లక్నో జట్టు ప్రస్తుతం 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఈ జట్టుకు మరొక మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. చివరిమ్యాచ్‌లో విజయం సాధించినా ప్రస్తుత రన్‌రేట్‌తో లక్నో కూడా ప్లేఆఫ్‌కు చేరడం అసాధ్యం.
మంగళవారం మ్యాచ్‌లో ఢిల్లీ విధించిన 209 పరుగుల చేధనలో లక్నో పోరాడినా ఫలితం సాధించలేకపోయింది. 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే సాధించింది. చేధనలో ఢిల్లీ ఓపెనర్లు డికాక్‌, కెఎల రాహుల్‌తో పాటు, స్టోయిన్స్‌, దీపక్‌ హూడా తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో 4 వికెట్ల నష్టానికి 44 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ దశలో పూరన్‌ (61 పరుగులు) దాటిగా ఆడటంలో లక్నో రేసులోకి వచ్చింది. ఈ తరువాత అర్షద్‌ ఖాన్‌ (58 నాటౌట్‌) జట్టును గెలిపించడానికి ప్రయత్నించాడు. దీంతో చివరిలో ఓవర్‌లో విజయం కోసం 23 పరుగులు చేయాలి ఈ స్థితిలో రషిక్‌ సలాన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో లక్నోకు ఓటమి తప్పలేదు. మూడు కీలక వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్‌ ఇశాంత్‌ శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ అవార్డు లభించింది.
మంగళవారం మ్యాచ్‌లో టాస్‌ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌లో బ్యాటర్లు కదం తొక్కారు. ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 208పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. ఫ్రేజర్‌(0) రెండో బంతికే డకౌట్‌ కావడంతో ఢిల్లీ కష్టాలతోనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ డకౌటైనా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ పొరెల్‌(58) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అయితే.. నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద పూరన్‌ చేతికి దొరికాడు. ఆ తర్వాత షారు హౌప్‌(38) అండగా పొరెల్‌ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్‌ మారినా బంతి లక్ష్యం బౌండరీయే అన్నట్టుగా చిచ్చరపిడుగు చెలరేగాడు. హోప్‌ సైతం ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో రాణించడంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ ద్వయాన్ని బిష్ణోరు విడదీశాడు. హౌప్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(33) ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత క్రీజ్‌లో నిలదొక్కుకున్నాక బ్యాట్‌ ఝుళిపించాడు. 23బంతుల్లో 5ఫోర్లు సాయంతో 33పరుగులు చేసి నవీన్‌-ఉల్‌-హక్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివర్లో స్టబ్స్‌(57నాటౌట్‌; 25బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌(14నాటౌట్‌) రాణించడంతో ఢిల్లీ జట్టు భారీస్కోర్‌ నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు ఇదే ఆఖరి మ్యాచ్‌ కాగా.. ఆ జట్టు 12పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో బౌలర్లు నవీన్‌-ఉల్‌ హక్‌కు రెండు, బిష్ణోరు, ఆర్షాద్‌ ఖాన్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: ఫ్రేజర్‌ (సి)నవీన్‌-ఉల్‌-హక్‌ (బి)ఆర్షాద్‌ ఖాన్‌ 0, అభిషేక్‌ పోరెల్‌ (సి)పూరన్‌ (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 58, హోప్‌ (సి)రాహుల్‌ (బి)రవి బిష్ణోరు 38, రిషబ్‌ పంత్‌ (సి)దీపక్‌ హుడా (బి)నవీన్‌-ఉల్‌-హక్‌ 33, స్టబ్స్‌ (నాటౌట్‌) 57, అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 14, అదనం 8, (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 208పరుగులు.
వికెట్ల పతనం: 1/2, 2/94, 3/111, 4/158
బౌలింగ్‌: ఆర్షాద్‌ ఖాన్‌ 3-0-45-1, మొహిసిన్‌ ఖాన్‌ 4-0-29-0, యుధ్‌వీర్‌ సింగ్‌ 2-0-28-0, నవీన్‌-ఉల్‌-హక్‌ 4-0-51-2, రవి బిష్ణోరు 4-0-26-1, కృనాల్‌ పాండ్య 2-0-20-0, దీపక్‌ హుడా 1-0-9-0