జోరువానలోనూ బతుకు పోరు

– కలెక్టరేట్ల ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా
– భారీ వర్షంలోనే నిరసన
– ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రగతిభవన్‌ ముట్టడిస్తామని హెచ్చరిక
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యల పరిష్కారం కోసం 22 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. జోరు వానలోనూ గురువారం కలెక్టరేట్లను ముట్టడించారు. వర్షంలోనే కూర్చుని నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇకనైనా తమ గోడు వినకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌ ఆధ్వర్యంలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. వీరికి కేవీపీఎస్‌, గిరిజన సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టర్‌ నారాయణకు తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా పాలడుగు సుధాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజులుగా జీపీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. సమ్మె చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కారించకుండా వారిని అధికారులు బెదిరించడం సరికాదన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు అన్ని మండలాల నుంచి కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి బయటకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మొదట మున్సిపల్‌ ఆఫీసు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. వర్షం కురుస్తున్నా గొడుగులు, రెయిన్‌కోట్లు ధరించి ఎర్రజెండా చేతపట్టి కదం తొక్కారు. ధర్నా నేపథ్యంలో కార్యాలయ గేట్లను మూసేయడంతో వానలోనే కార్మికులు ధర్నా చేశారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకత్వంలో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. యాదాద్రిభువనగిరి, నల్లగొండ కలెక్టరేట్లను వేలాది మంది కార్మికులు ముట్టడించారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల్ని సైతం లెక్కచేయకుండా గొడుగులు, కొప్పర్లు పట్టుకుని ధర్నాలో పాల్గొన్నారు.