
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఉన్న అన్ని శాఖల డి.డి.ఓ లు, సిబ్బంది విధిగా ఆదాయపు పన్ను చెల్లింపు తో పాటు టి.డి.ఎస్ చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కోశాధికారి రవి కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆదాయపు పన్ను టి.డి.ఎస్.వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ముందుగానే ఆదాయపు పన్నును 12 నెలలుగా విభజించి ప్రతినెల వేతనం ద్వారా ఆదాయపు పన్ను శాఖకు చెల్లించి తదుపరి ప్రతి త్రైమాసానికి టి.డి.ఎస్. 24 క్యూ చేయించుకోవాలని, సూచించారు. ఆదాయపు పన్ను చెల్లించి టి.డి.ఎస్. చేయించుకోక పోతే రోజుకు రూ.200 చొప్పున అపరాధ రుసుమంకి సంబంధించిన నోటీసులు అధికారులకు అందుతాయని తెలిపారు. అదేవిదంగా ఆన్లైన్ ద్వారానే డి.డి.ఓ లు ఫామ్ 16 ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న ప్రతి ఉద్యోగి విధిగా ఫిబ్రవరి వేతనంలో పన్ను మినహాయింపు చేసి ఆదాయపు పన్ను శాఖకు అందచేయాలని సూచించారు.హైద్రాబాద్ నుండి వచ్చిన ఆదాయపు పన్ను అధికారులు మానస్ రంజన్ బెహ్రా, పౌలియన్ హాంగ్ ఆదాయపు పన్ను విది విధానాలపై అలాగే 24 క్యూ, టి.డి.ఎస్ ట్రసెస్ పోర్టల్ ఎలా వినియోగించాలానే అంశం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సి.ఈ. ఓ సురేష్, జిల్లా ఆదాయపు పన్ను శాఖ అధికారి ప్రకాష్ శర్మ, ఏ.టి.ఓ లు అనిల్ కుమార్, శ్రీనివాస్, ఎస్.టి.ఓలు, ఇన్సెక్టర్స్ వీరెందర్, కిరణ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.