ప్రతి ఇల్లూ ఓ పోరాట కేంద్రంగా మారాలి

– ఆడబిడ్డలకు న్యాయం కోసం కదలిరండి
– బ్రిజ్‌భూషణ్‌కు తప్పించేందుకు కేంద్రం మౌనం :ఐద్వా అఖిల భారత కోశాధికారి ఎస్‌.పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రెజ్లర్ల పోరాటం స్ఫూర్తిదాయకమనీ, వారంతా తమ ఇంట్లోని ఓ ఆడబిడ్డగానే భావించి ప్రతి ఇంటినీ ఓ పోరాట కేంద్రంగా మార్చాలని ప్రజలకు ఐద్వా అఖిల భారత కోశాధికారి ఎస్‌.పుణ్యవతి పిలుపునిచ్చారు. దేశమంతటా సర్వత్రా విమర్శలొస్తున్నా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌ను అరెస్టు చేయకుండా బీజేపీ సర్కారు మొండిగా ముందుకెళ్తున్నదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహిళా రెజ్లర్ల పట్ల మనువాదుల దురహంకారం అనే అంశంపై వెబినార్‌ను నిర్వహించారు. అందులో పుణ్యవతి మాట్లాడుతూ.. దేశ చరిత్రను ఆడబిడ్డలు తిరగరాస్తారనీ గురజాడ చెప్పినట్టుగానే క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారనీ, దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తున్నారని అన్నారు. అది గిట్టకే మనువాదులు ఆడబిడ్డలను అణచివేస్తున్నారనీ, మనుధర్మ శాస్త్రం ప్రకారం అణిగిమనిగి ఉండేలా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కొంత భాగం మీడియా కూడా పుండుమీద కారంచల్లినట్టుగా రెజ్లర్లను లైంగిక దాడికి సంబంధించిన ఆధారాలు, ఫొటోలు, వీడియోలు చూపించాలని రెజ్లర్లను వేధించడం దుర్మార్గమని విమర్శించారు. కెమెరాలు తీసుకెళ్లడానికి అది ఏమైనా ఫొటో సెషనా? అని ప్రశ్నించారు. ఆ మీడియా ప్రతినిధుల ఇండ్లలోని మహిళలకు ఇలా జరిగితే అట్లాగే వ్యవహరిస్తారా? అని నిలదీశారు. అంతర్జాతీయ వేదికల మీద దేశ చరిత్రను ఇమిడింపజేసిన మహిళా రెజ్లర్ల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగాదన్నారు. అమ్మాయిలు రోడ్లెక్కి పోరాటం చేస్తుంటే అంతర్జాతీయంగా మన పరువు, మర్యాద పోతుందనే ఆలోచన కూడా మోడీ సర్కారుకు ఎందుకు కలగడం లేదని ప్రశ్నించారు. ఆడబిడ్డల పోరాటం పట్టదా? వారికి న్యాయం చేయాలనే సోయి లేదా? అని నిలదీశారు. ఓట్ల రాజకీయం కోసం వేధించిన వ్యక్తినే కాపాడటానికే యత్నిస్తున్న తీరును తప్పుబట్టారు. న్యాయం అడిగితే.. మెడల్స్‌ తెచ్చిన ఆడబిడ్డలను జైళ్లలో పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తాత్కాలికంగా తమ పోరాటాన్ని వాయిదా వేస్తున్నామని రెజ్లర్లు స్పష్టంగా ప్రకటిస్తే… బీజేపీ సోషల్‌ మీడియా వారిపై అసత్య, అసభ్యకరంగా ప్రచారాలు చేయడం దుర్మార్గమన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడే శక్తి బ్రిజ్‌భూషణ్‌కు ఉంది కాబట్టే వెంటనే అతన్ని అరెస్టు చేయాలని రెజ్లర్లు కోరుతున్న డిమాండ్‌లో న్యాయం ఉందన్నారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయకపోగా అతను అక్కడ ఉండగానే సీన్‌ అపెన్స్‌ చూడటానికి ఒక అమ్మాయిని అక్కడకు తీసుకెళ్లడం దారుణమని విమర్శించారు. వారిని మానసిక వేధించడమేని నొక్కి చెప్పారు. కేసులు వెనక్కి తీసుకోవాలని రెజ్లర్లకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. నిందితులను వదిలేసి బాధితుల్ని వేధించడం దారుణమన్నారు. అధికారం అనుభవించేవాళ్లకు ఒక న్యాయం? సామాన్యులకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.