అందరూ ఆశ్చర్యపోతున్నారు

పేదరికం కలలు నిజం చేసుకునేందుకు అడ్డంకి కాలేదు. ఆకలే కష్టాలను అలవాటు చేస్తుందంటారు. మనం చేసే కొత్త ఆలోచన బతకడాన్ని నేర్పిస్తుంది. బలమైన లక్ష్యం మన జీవితాన్ని విజయ పథాన నడిపిస్తుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం సాకే భారతి. చదువంటే అమితమైన ఆసక్తి. పేదరికంతో చిన్నతనంలోనే పెండ్లి చేసుకోవల్సి వచ్చింది. అయినా భర్త ప్రోత్సాహంతో ముందడుగు వేసింది. దినసరి కూలీగా చెమటోడ్చింది. అనుకున్న గమ్యం చేరాలనే తపనతో అహర్నిశలూ శ్రమించింది. ఇటీవలె రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకుంది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందరికో మహిళలకు ఆదర్శంగా నిలిచింది. అలాంటి ఆమె స్ఫూర్తి దాయక జీవిత పరిచయం నేటి మానవిలో…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువుకు నిలయమైన అనంతపురం జిల్లా. ఆ జిల్లాలోని శింగనమల మండలం నాగులగుడ్డం భారతి సొంతూరు. అది ఓ మారుమూల పల్లె. ఆ ఊరి చివర చిన్న రేకుల షెడ్డులో భర్త, కూతురితో కలిసి జీవిస్తుంది ఆమె. చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది భారతికి. తల్లిదండ్రులకు ముగ్గురాడపిల్లలు. వారిలో ఈమే పెద్దది. చదువుపై ఉన్న ఇష్టంతో భారతి పదో తరగతి వరకూ శింగనమల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్‌ పామిడి జూనియర్‌ కాలేజీలో పూర్తిచేసింది. అయితే కుటుంబ బాధ్యతలు, ఆర్థిక స్థితి బాగోలేక పెద్ద కూతురైన భారతికి పెండ్లి చేయాలనుకున్నాడు తండ్రి. ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత మేనమామ శివప్రసాద్‌తో పెండ్లి చేశారు.
భవిష్యత్తుపై ఎన్నో కలలు
పై చదువులు చదివి మంచి స్థాయిలో ఉండాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కానీ ఆ విషయాలేవీ భర్తకు చెప్పలేక పోయింది. అయితే అతడే ఆమె కోరికను, ఇష్టాలను, చదువుపై ఉన్న ఆసక్తిని అర్థం చేసుకున్నాడు. పై చదువులు చదివేందుకు ప్రోత్సాహం అందించాడు. భారతి కూడా తమ జీవితాలను బాగు చేసుకోవడానికి చదువు మంచి అవకాశం అనుకుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. తన చదువు భర్తకు భారం కాకూడదనుకుంది. అందుకే కొన్నిరోజులు కాలేజీకి వెళ్తూ, మరికొన్ని దినాలు కూలీపనులు చేస్తూనే అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీలో డిగ్రీ, పీజీ పూర్తి చేసింది.
నడిచి వెళ్లేది
భారతి డిగ్రీ చేస్తున్నపుడే గాయత్రి పుట్టింది. ఆ బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూనే చదువు కొనసాగించింది. అలాగే కూలీ పనులకు కూడా వెళ్ళేది. ఇలా అన్ని పనులూ సమన్వయం చేసుకునేది. కోచింగ్‌లు, ట్యూషన్లకు వెళ్ళే ఆర్థిక స్థోమత లేదు. అందుకే రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ చదువుకునేది. మళ్లీ తెల్లవారక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. కాలేజీకి వెళ్లాలంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. బస్‌ ఛార్జీలకు అదను భారం ఎందుకని ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె అనే గ్రామం వరకు నడిచి వెళ్లేది. అక్కడ బస్సెక్కి కాలేజీకి వెళ్ళేది. ఇన్ని కష్టాలు పడుతూనే ఆమె డిగ్రీ, పీజీ మంచి మార్కులతో పూర్తిచేసింది. అది చూసి అధ్యపకులు పీహెచ్‌డీ కూడా చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. భర్త కూడా అదే మాట అన్నాడు. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. వెంటనే పీహెచ్‌డీ సీటు కోసం ప్రయత్నించింది.
అందరూ ఆశ్చర్యపోయారు
భారతి కృషి ఫలించి పీహెచ్‌డీలో సీటు వచ్చింది. ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్‌’ అంశంపై పరిశోధనకు అవకాశం దక్కింది. గైడ్‌ కూడా ఆమెకు ఎంతో సహకరించారు. పరిశోధనా విద్యార్థులకు వచ్చే ఉపకార వేతనానికి ఎంపికయింది. అది ఆమె చదువుకు కొంత సాయపడింది. అయినా కూలి పనులు మాత్రం మానలేదు. అలా కష్టపడి చదివి పరిశోధన కూడా పూర్తి చేసింది. తన కలను నిజం చేసుకుంది. ఇటీవలె శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం పీహెచ్‌డీ పట్టా అందుకోవడానికి భర్త, కూతురుతో కలిసి వెళ్ళింది. సాదాసీదాగా వేదిక పైకి వెళ్ళిన ఆమె ఆహార్యం, వేసుకున్న దుస్తులు చూసి ‘ఈమె రసాయన శాస్త్రంలో పీహెచ్‌డి పూర్తి చేసిందా’ అంటూ ఆశ్చర్య పోయారు. ఇప్పుడు గ్రామంలోని యువత, మహిళలకు ఆమెకు ఒక ఐకాన్‌. అందరి ముఖాల్లో ఆనందం. తమతో పాటు రోజూ కూలికి వచ్చే భారతి చదువులో ఇంతగా రాణించిందా అంటూ గ్రామ ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. శుభాకాంక్షలతో ఆమెను ముంచెత్తుతున్నారు.
చదువు మా జీవితాల్ని బాగు చేస్తుంది
పేదరికం లక్ష్యసాధనకు అడ్డంకి కాదని రుజువు చేసిన భారతి ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలిచింది. పెండ్లి తర్వాత కుటుంబ బాధ్యతలతో ‘ఇక ఏం చదువుకుంటాలే’ అంటూ నిరుత్సాహపడే మహిళలకు సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ మన లక్ష్యాన్ని అట్టుకోలేవని నిరూపించింది. తన లాంటి మహిళలకు మంచి మార్గాన్ని చూపింది. ఇంత సాధించినా ఆమెలో ఇసుమంతైనా గర్వం కనిపించలేదు. ‘డాక్టరేట్‌ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మంది పంచొచ్చు. నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుంది… ఇవే నన్ను ఈ స్థాయి వరకు నడిపించాయి’ అంటున్న భారతి జీవితం మహిళలకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే.