పదవిలేకున్నా మాజీ సర్పంచ్ దాతృత్వం 

– ప్రజల విజ్ఞప్తితో రొడ్డుపై గుంతలను పూడ్చిన వైనం 
– మాజీ సర్పంచ్ నర్సయ్యకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు 
నవతెలంగాణ-బెజ్జంకి 
అతనో మండల కేంద్రానికి మాజీ సర్పంచ్.ప్రస్తుతం తన జీవానోపాధి కోసం కారు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.పదవులుంటేనే ప్రజల విజ్ఞప్తులు పట్టించుకొని ప్రజాప్రతినిధులున్న ఈ రోజుల్లో ఏ పదవిలేకున్నా ఒక సామాన్యుడిగా జీవనం సాగిస్తూ తన ప్రజల విజ్ఞప్తుల పరిష్కారం కోసం తనదైన శైలిలో స్పందించి సమస్యను పరిష్కరించిన తన దాతృత్వాన్ని చాటాడు మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య.ఇటీవల కురిసిన వర్షాల వల్ల మండల కేంద్రంలోని కల్లేపల్లి గ్రామం వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమస్యను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని చివరి యత్నంగా సమస్యను సోమవారం గ్రామస్తులు బోనగం రాజేశం,బోనాల లింగయ్య మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య దృష్టికి తీసుకువెళ్లామని వెంటనే స్పందించి తన స్వంత ఖర్చులతో మట్టితో గుంతలను పూడ్చి చదును చేయించారని గ్రామస్తులు తెలిపారు.పదవిలేకున్నా ప్రజా క్షేమం కోసం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించిన మాజీ సర్పంచ్ నర్సయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.