ఆశాలకు పరీక్ష రద్దు చేయాలి

– ఆశా వర్కర్స్‌ యూనియన్‌
జిల్లా కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి
నవతెలంగాణ-కాప్రా
గత 18 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా పని చేస్తున్న వారికి ఎగ్జామ్‌ పెట్టి తీసుకుం టామని ప్రభుత్వం ప్రకటిం చడం దుర్మార్గమని, వెంటనే పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కమిటీ కార్యదర్శి ఎం రేవతి కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏ హేమలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎం రేవతి కళ్యాణి మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుంచి జిల్లాలో ఆశా వర్కర్లు పేద ప్రజలకు అనేక రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. కానీ ఆశాలను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ ,ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధత సౌకర్యాలు ఏమీ ఇప్పటివరకు ఆశాలకు కల్పించలేదని.. కనీసం ఫిక్స్డ్‌ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయించలేదన్నారు. పైగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆశాలకు ఎగ్జామ్‌ నిర్వహించి ఉత్తీర్ణత సాధించని ఆశాలను ఇంటికి పంపాలని నిర్ణయిం చిందన్నారు. ఇది ఆశాలను కించపరచడంతో పాటు ఆశాల సీనియార్టీని తగ్గించి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం తప్ప మరొకటి కాద న్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు కనీస వేతనం రూ. 18 వేలకు పెంచి ఫిక్స్డ్‌ వేతనం నిర్ణయించాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుతూ జూన్‌ 5న ఆశా డే సమావేశాల సందర్భంగా పీహెచ్‌సీల ముందు, జూన్‌ 12న కలెక్టరేట్‌ ఆఫీస్‌ ముందు జరుగు ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.