ఏడాదికి రెండుసార్లు పరీక్షలు తప్పనిసరి కాదు

– 10, 12వ తరగతి బోర్డు పరీక్షలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
న్యూఢిల్లీ : ఏడాదికి రెండుసార్లు 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థులు హాజరుకావడం తప్పనిసరి కాదని, విద్యార్థులు ఒత్తిడిని తగ్గించుకునేందుకే ఈ ఆప్షన్‌ను ప్రవేశపెడుతున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ‘ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష జెఇఇ మాదిరిగానే.. 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలకు కూడా సంవత్సరానికి రెండుసార్లు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా ఐచ్ఛికం, తప్పనిసరికాదు’ అని తెలిపారు. సంవత్సరంలో ఒకే అవకాశంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడిని తగ్గించడానికే ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు.