– ములుగు జిల్లా ఎన్నికల అబ్జర్వర్ అంజన్ చక్రభర్తీ
– మేడారంలో వనదేవతలకు ప్రత్యేక మొక్కలు
– తాడ్వాయి, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల సందర్శన
నవతెలంగాణ -తాడ్వాయి
ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ములుగు జిల్లా ఎన్నికల ప్రత్యేక అధికారులు(అబ్జర్వర్లు) అంజన్ చక్రభర్తీ (ఐపీఎస్), వీకే సింగ్(ఐఆర్‌ఎస్) అన్నారు. సోమవారం మండలంలోని మేడారం వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం తాడ్వాయి, మేడారంలోని రెడ్డిగూడెం 2 పోలింగ్ కేంద్రాలను స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్, పస్రా సిఐ శంకర్ తో కలిసి సందర్శించి పరిశీలించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్ కు ఉందన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పస్రా సిఐ శంకర్, స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్, మేడారం వనదేవతల పూజారులు, ఎండోమెంట్ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.