ఒమన్‌ జలసంధిలో భారత్‌, ఫ్రాన్స్‌, యూఏఈల విన్యాసాలు

న్యూఢిల్లీ : ఒమన్‌ జలసంధిలో ఈ నెల 7, 8 తేదీల్లో భారత్‌, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)దేశాల నావికా దళాలు త్రైపాక్షిక సముద్ర జలాల భాగస్వామ్య విన్యాసాలను నిర్వహించాయి. ”ప్రధాన విన్యాసాల కార్యక్రమం సందర్భంగా సముద్రంలో విస్తృత స్థాయిలో విన్యాసాలు చోటు చేసుకున్నాయి.
వ్యూహాత్మక ఫైరింగ్‌తో కూడిన ఉపరితల యుద్ధ కార్యకలాపాలు, క్షిపణులతో విన్యాసాలు, ఫ్రెంచి రాఫెల్‌, యుఎఇ డాష్‌-8 మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఎంపిఎ)లతో అత్యంత అధునాతనమైన వైమానిక రక్షణ విన్యాసాలు, హెలికాప్టర్‌ క్రాస్‌ ల్యాండింగ్‌ ఆపరేషన్లు, సముద్ర జలాల్లో స్టాక్‌ను నింపుకునే డ్రిల్స్‌ వంటి చర్యలను మూడుదేశాల నావికాదళాలు నిర్వహించాయని భారత నేవీ పేర్కొంది. ఈ విన్యాసాల కోసం భారత నావికాదళం స్టెల్త్‌ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ తర్కష్‌ను మొహరించింది. అత్యుత్తమ పద్దతులు గురించి పరస్పరం తెలుసుకోవడానికి ఈ శిక్షణా విన్యాసాలు ఉపకరించాయి.
ఈ మూడు దేశాల నావికాదళాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ విన్యాసాలు దోహదపడ్డాయని, సముద్రజలాల్లో ఎదురయ్యే సాంప్రదాయ, సాంప్రదాయేతర ముప్పులను ఎదుర్కొనడానికి కూడా ఉపయోగపడ్డాయని భారత నేవీ పేర్కొంది. ఈ ప్రాంతంలో సముద్ర జలాల్లో నౌకల స్వేచ్ఛా రాకపోకలకు, వాణిజ్యానికి, భద్రతకు కూడా హామీ కల్పించబడిందని పేర్కొంది.