సత్వర విచారణ

Expedited investigation– ఎంపీ ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసులపై హైకోర్టులకు సుప్రీం ఆదేశం
– ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటుచేయాలి
– ట్రయల్‌ కోర్టు విచారణను వాయిదా వేయొద్దు
– కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను సిద్ధంచేయాలి
– సర్వోన్నత న్యాయస్థానం దిశానిర్దేశం
న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై నమోదైన తీవ్రమైన నేరాల (క్రిమినల్‌ కేసులు) విచారణలను వేగంగా పూర్తి చేసేందుకు కచ్చితమైన, ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించడం క్లిష్టమైన ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించ డానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీచేయకుండా జీవిత కాలం నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ మేరకు ఎంపీ, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను సూచించింది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్‌ కేసులను త్వరితగతిన విచారించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటుచేయాలని సూచించింది. అవసరాన్ని బట్టీ క్రయ వ్యవధిలో కేసులను జాబితా చేయాలని పేర్కొంది. ఈ కేసులను ఏడాదిలోపే పరిష్కరించేలా చూడాలని హైకోర్టులను ఆదేశించింది. క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులను ధర్మాసనం ఆదేశించింది.
ట్రయల్‌ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. కేసుల వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక ట్యాబ్‌ ఏర్పాటుచేసి అందులో పొందుపరచాలని సూచించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించింది. అయితే దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.