వ్యయం అధికం…పనులు స్వల్పం

Costs are high...works are low– నత్తనడకన కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం గురి తప్పుతున్న లక్ష్యాలు
న్యూఢిల్లీ : దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ తరచూ చెబుతుంటారు. అప్పుడప్పుడూ వాటికి సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూనో లేదా వాటిని ప్రారంభిస్తూనో ఉంటారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ హడావిడి ఎక్కువగా కన్పిస్తుంది. అయితే మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వ లక్ష్యాలు గురి తప్పుతున్నాయని ఇటీవల విడుదలైన రెండు నివేదికలు వేలెత్తి చూపాయి.
భారత్‌మాల ప్రాజెక్టుపై…
వీటిలో కాగ్‌ నివేదిక ఒకటి. దేశంలో 2017-2022 మధ్యకాలంలో దాదాపు 35 వేల కిలోమీటర్ల పొడవునా రూ.5.35 లక్షల కోట్ల వ్యయంతో ఆర్థిక కారిడార్లు, జాతీయ రహదారులు, సరిహద్దు రోడ్లు, కోస్తా హైవేలు నిర్మించేందుకు ఉద్దేశించిన భారత్‌మాల ప్రాజెక్ట్‌ నత్తనడకన సాగుతోందని కాగ్‌ తెలిపింది. ఈ సంవత్సరం మార్చి నాటికి కేవలం 13,499 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం మాత్రమే పూర్తయింది. అనుకున్న లక్ష్యంలో ఇది కేవలం 38.79% మాత్రమే. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.8.47 లక్షల కోట్లు మంజూరు చేశారు. ప్రారంభంలో కిలోమీటరుకు రూ.15.37 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఇప్పుడా వ్యయం రూ.32.17 కోట్లకు చేరింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం గత సంవత్సరం సెప్టెంబర్‌తోనే పూర్తి కావాల్సి ఉండగా ఆ తర్వాత ఆరు నెలలు గడిచినా కేవలం 40% మాత్రమే పూర్తయింది. మరోవైపు ప్రాజెక్టు వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. అటవీ అనుమతులు, ఇతర వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను సమస్యలను పరిష్కరించకుండానే భారత్‌మాల ప్రాజెక్టులో చేర్చారు. పైగా ప్రాజెక్టు నిర్మాణ దశలో అనేక మార్పులు, చేర్పులు చేశారు. కొన్ని ప్రాజెక్టుల విషయంలో కనీసం నివేదికలు కూడా రూపొందించలేదు. పర్యావరణ అనుమతులు పొందకుండానే ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించిన ఉదంతాలు ఉన్నాయి.
పీఎం గ్రామీణ్‌ సడక్‌ యోజనపై…
ఇక ప్రధానమంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన పథకంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. ఇది గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పథకం. దీనిని 2000వ సంవత్సరంలో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. అప్పటి నుండి గత సంవత్సరం అక్టోబర్‌ 25వ తేదీ వరకూ రూ.2,87,798 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోడ్ల నిర్మాణంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వాములను చేసింది. మొదటి దశలో 1.57 లక్షల ఆవాసాలను కలుపుతూ 6.45 లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా గత సంవత్సరం అక్టోబర్‌ నాటికి 6.21 లక్షల కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు. 2013లో ప్రారంభించిన రెండో దశలో 48,383 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. మోడీ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం కోసం ఓ పథకాన్ని ప్రారంభించారు. అయితే లక్ష్యంలో సగం కూడా నెరవేరలేదు. ఇదిలావుండగానే 2019లో మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులను అనుసంధానం చేసే మరో ప్రాజెక్టును చేపట్టారు. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వ పాలనలో గ్రామీణ సడక్‌ యోజన పథకం తొలి దశను ప్రారంభించగా రెండు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ 24 వేల కిలోమీటర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. దశాబ్దం క్రితం ప్రారంభమైన రెండో దశలో 1600 కిలోమీటర్ల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు. వాటిని పూర్తి చేయకుండానే మోడీ ప్రభుత్వం మరికొన్ని పథకాలకు శ్రీకారం చుట్టింది. అయితే వాటి పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
గ్రామీణ సడక్‌ యోజన పథకంలో భాగంగా తొలి దశ, రెండో దశ పనులను పూర్తి చేయని రాష్ట్రాలకు మూడో దశ ప్రాజెక్టులు కేటాయించలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. దీంతో పథకం అమలులో బాగా జాప్యం జరుగుతోంది. గతంలో ఈ పథకానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరించేది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్రాలు 60:40 నిష్పత్తిలో వ్యయాన్ని భరించాలని నిర్దేశించారు. కొండ ప్రాంత రాష్ట్రాలు పది శాతం ఖర్చును భరిస్తే సరిపోతుంది. అయితే కోవిడ్‌ ప్రభావంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. దీంతో అవి పథకానికి అయ్యే తమ వంత వాటాను జమ చేయలేకపోతున్నాయి. ఫలితంగా పథకం అమలు నత్తనడక నడుస్తోంది.
నిధుల కొరత సాకుతో…
పైగా 2001 సంవత్సరపు జనగణన ఆధారంగా జనాభాను, ఆవాస ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటికి 22 సంవత్సరాలు గడిచాయి. 2001-2011 మధ్య కాలంలో దేశ జనాభా సగటున 17.7% పెరిగింది. 2011-2021 మధ్య అదే స్థాయిలో జనాభా పెరుగుతుందని అంచనా వేసినా 2001తో పోలిస్తే 2021 నాటికి జనాభా 30% పెరుగుతుంది. అంటే తొలుత నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే ఆవాస ప్రాంతాల సంఖ్య అధికంగా ఉంటాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తెచ్చామని, అయితే నిధుల కొరతను కారణంగా చూపి తమ ప్రతిపాదనను తిరస్కరించిందని పార్లమెంటరీ కమిటీకి గ్రామీణాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చింది. దీనిని బట్టి అర్థమవుతోంది ఏమంటే గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు నిర్మించడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. దీనిపై పెట్టే ఖర్చు అనవసరమని కేంద్రం భావిస్తోంది. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటోంది.