మంత్రి సెంథిల్‌ బాలాజీ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

చెన్నై : ‘క్యాష్‌ ఫర్‌ జాబ్‌’ కుంభకోణం కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి వి.సెంథిల్‌ బాలాజీ జ్యుడిషియల్‌ కస్టడీని ఆగస్టు 8వ తేదీ వరకూ చెన్నై సెషన్స్‌ కోర్టు పొడిగించింది. ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించడం ఇది మూడోసారి. ప్రస్తుతం పుళల్‌ జైలులో ఉన్న సెంథిల్‌ బాలాజీ జ్యుడిషియల్‌ కస్టడీ బుధవారంతో ముగియనుండటంతో ఆయనను వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎస్‌.అలి ముందు హాజరుపరిచారు. దీనికి ముందు, సెంథిల్‌ బాలాజీ అరెస్టుపై ఆయన భార్య మేఘల వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం క్లోజ్‌ చేసింది. బాలాజీ అరెస్టు చట్టవిరుద్ధమని, ఒక వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై ఇంటరాగేషన్‌ పేరుతో అరెస్టు చేసే అధికారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి లేదని పిటిషనర్‌ వాదించారు. దీనిపై న్యాయమూర్తులు నిషా భాను, డి.బి.చక్రవర్తి పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇచ్చారు. దీంతో దీనిపై మరోసారి విచారణ జరిపిన జస్టిస్‌ సీవీ కార్తికేయన్‌ ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. సెంధిల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనంటూ ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యాష్‌ ఫర్‌ జాబ్‌ స్కామ్‌లో మనీలాండరింగ్‌ కింద జూన్‌ 14న సెంథిల్‌ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. గతంలో అన్నాడీఎంకే హయాంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ కుంభకోణానికి పాల్పడినట్టు ఈడీ ఆరోపణగా ఉంది. ఈడీ అరెస్టుతో ఆయన విద్యుత్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ మంత్రి పదవులను కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ఏ శాఖ లేని మంత్రిగా డీఎంకే ప్రభుత్వంలో కొనసాగుతున్నారు.