వడ్ల కొనుగోలులో దోపిడీని అరికట్టాలి

– తెలంగాణ ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక
– జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-వేలేరు
అకాల వర్షాలు రాబోతున్నాయని, రైతులు పండించిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలని, ఐకెపి సెంటర్లు, మిల్లర్లు కలిసి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని, వెంటనే దోపిడీని అరికట్టాలని తెలంగాణ ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి అన్నారు. వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజాసంఘాల మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో చక్రపాణి పాల్గొని మాట్లా డారు. ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు వేగవంతం చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు సందర్భంగా క్వింటాకు రూ.5 కిలోలు తరుగు పేరుతో, అలాగే మిల్లుకు పోయిన తర్వాత మిల్లర్లు 8కిలోలు తరుగు పేరుతో తీస్తున్నారని ఆరోపించారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు సందర్భంగా ఐకేపీ సెంటర్లు, మిల్లుల దగ్గర జరిగే దోపిడీని జిల్లా అధికారులు అరికట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు పని ప్రదేశాలలో మంచినీరు, టెంటు, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, పనిముట్ల కిరాయి డబ్బులు, కొలతలు లేకుండా కూలీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ ఉపాధి హామీ కూలి డబ్బులను తక్షణ మే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయ కులు సారా వెంకటేష్‌, ఏం రాజు, ఏ శ్యాము, ఏ.వెంకటేష్‌, బంక శ్రీనివాస్‌, బాణాల సుధాకర్‌, కొయ్యడ శంకర్‌, జోగు శంకర్‌, తిరుపతి, రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.