నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు

– ముగ్గురు నిందితుల అరెస్ట్‌
– వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు సీజ్‌
నవతెలంగాణ- సిటీబ్యూరో
విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన సర్టిఫికెట్లతోపాటు ఉన్నత చదువులకు అవసరమయ్యే సర్టిఫికెట్లు నకిలీవి తయారు చేస్తూ.. విక్రయిస్తున్న ముఠాను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు, ఫలక్‌నుమా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి వివిధ యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూషన్లకు చెందిన నకిలీ సర్టిఫికెట్లతోపాటు కంప్యూటర్‌, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శనివారం చార్మినార్‌ ఏసీపీ రుద్ర భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం..
చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ కలిముద్దీన్‌ 7వ తరగతి చదివాడు. చెత్తబజార్‌లోని ‘డైమండ్‌ గ్రాఫిక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌’లో డీటీపీ ఆపరేటర్‌గా చేరాడు. 2015లో అక్కడ గ్రాఫిక్స్‌, కోరల్‌డ్రా సాఫ్ట్‌వేర్‌ నేర్చుకున్నాడు. ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించాలని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించాడు. విషయాన్ని రాజేంద్రనగర్‌కు చెందిన ఎండీ ఫేరోజ్‌, లంగర్‌హౌజ్‌కు చెందిన అబ్దుల్‌ బాషీత్‌ ఆసీఫ్‌కు చెప్పాడు. వారితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఢిల్లీకి చెందిన శివానితో చేతులు కలిపారు. అమెరికా, యూకేతోపాటు తదితర దేశాలకు వెళ్లేవారితోపాటు ఉన్నత చదువులకు అవసరమైన సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. వాటిని కావాల్సినవారికి విక్రయిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. ఆంధ్రా యూనివర్శిటీ, ఉస్మానియా, చండిగఢ్‌తోపాటు వివిధ యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు పలుసార్లు జైలుకెళ్లొచ్చినా వారిలో మార్పురాలేదని ఏసీపీ తెలిపారు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత నకిలీ సర్టిఫికెట్ల దందాను కొనసాగిస్తున్నారన్నారు. పరారీలోవున్న ఢిల్లీకి చెందిన శివాని కోసం గాలిస్తున్నామని చెప్పారు.