– పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫేక్ డాక్టర్లు
– ప్రజల ప్రాణాలతో చెలగాటం
– కేసులు నమోదు చేస్తున్నా ఆగని కేటుగాళ్లు
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. అర్హత లేకుండానే వైద్యులుగా చెలామణి అవుతూ నాడి పట్టి రోగమేదో చెప్పేస్తున్నారు. కత్తెరపట్టి ఆపరేషన్లూ చేసేస్తున్నారు. మందులను సైతం ఇచ్చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గల్లీలు, బస్తీలు, కాలనీలు, సిటీ పరిసర ప్రాంతాల్లో అర్హత లేని క్లినిక్‌లను ఓపెన్ చేసి వైద్యం చేస్తున్నారు. అక్కడక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నా.. కేటుగాళ్లు ఆగడం లేదు. సుమారు నెలకు నలుగురి వరకు పట్టుబడుతున్నారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరం వైద్యానికి పేరొందింది. ఇక్కడ నాణ్యమైన వైద్యం దొరుకుతుందనే ఆశతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నగరంలోని హాస్పిటల్స్‌కు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు అసలు, ఎవరు నకిలీ డాక్టర్ అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది, ఇంటర్ చదివి ప్రయివేటు హాస్పిటల్స్ వార్డు బారుగా పని చేసిన వారు, బీఎస్సీ, బీజెడ్‌సీ వారు సైతం ఎంబీబీఎస్, ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులుగా ప్రచారం చేసుకుంటున్నారు. అనుమతుల్లేకుండానే క్లినిక్‌లు ఓపెన్ చేసేస్తూ విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్లు ఎక్కిస్తున్నారు. రోగం ఏదైనా సరే హైడోస్ యాంటీ బయాటిక్‌లు ఇచ్చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ల అవతారం ఎత్తిన చాలా మంది వైద్యరంగంలో ఏండ్లుగా స్థిరపడి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సర్టిఫికెట్లను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో గల్లీలు, బస్తీలు, సిటీ పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. మరికొంత మంది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఎంబీబీఎస్ పత్రాలను సృష్టిస్తున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే డాక్టర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే నలుగురు నకిలీ డాక్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.
పేదల బస్తీలు, శివారు ప్రాంతాలే టార్గెట్..
గ్రేటర్ శివారు ప్రాంతాలతోపాటు పాతబస్తీలో పేదలు ఎక్కువగా నివసించే బస్తీలను ఈ నకిలీ వైద్యులు టార్గెట్ చేసుకుంటున్నారు. ఆరోగ్యంపై కనీస అవగాహన లేని వీరు హైడోస్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు, సిరప్‌లు ఇచ్చి అనుభవం ఉన్న వైద్యులుగా నమ్మిస్తున్నారు. తెలిసీ తెలియక ఇచ్చిన ఈ హైడోస్ మందుల వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి విముక్తి లభించినప్పటికీ.. భవిష్యత్‌లో తీవ్ర ప్రభావం చూపుతుంది. శరీంలోని కొన్ని అవయవాలపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. పాతబస్తీ, ఎల్బీనగర్, కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డి నగర్, వనస్థలిపురం, నాగోలు, బండ్లగూడ, సరూర్‌నగర్, మీర్‌పేట్, నాదర్‌గుల్, బోడుప్పల్, ఉప్పల్, శివం రోడ్డు, శాలిబండ, నారపల్లి, కీసర మండలంలోని రాజీవ్ గృహకల్ప ఏరియా, కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ, నానక్‌రాంగూడ, కుషాయిగూడ కాప్రా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఫేక్ వైద్యులు, క్లినిక్‌లు ఉంటున్నాయి.
క్రాస్ ప్రాక్టీస్‌తో వైద్యుడి అవతారం..
కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర కేంద్రంగా పని చేస్తున్న పలు డీమ్డ్ వర్సిటీలు, కన్సెల్టెన్సీల నుంచి సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. నకిలీ ఎంబీబీఎస్, ఎండీ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్స్‌తోపాటు బీఈఎంఎస్ పత్రాలనూ ఏర్పాటు చేస్తున్నారు. రబ్బర్ స్టాంపులను సైతం తయారు చేయిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్టు, డెంటల్, గైనకాలజిస్టు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరికొందరు డాక్టర్ పట్టాతోపాటు జీహెచ్‌ఎంసీ, కార్మికశాఖ జారీ చేసినట్టు ట్రేడ్ లైసెన్స్, తదితర పత్రాలను సృష్టించి డాక్టర్లుగా చెప్పుకుంటున్నారు.
ఇటీవల పట్టబడ్డ కొందరు నకిలీ వైద్యులే సాక్షం..
ఫలక్‌నుమాకు చెందిన ఖాజా ముజమ్మిల్ మా సబ్ ట్యాంక్‌లోని ‘మిస్వాక్ డెంటల్ హాస్పి టల్’లో అసిస్టెంట్‌గా 2006 నుంచి 2020 వరకు పని చేశారు. జీహెచ్ ఎంసీ, కార్మికశాఖ జారీ చేసినట్టు నకిలీ దృవపత్రాలను సృష్టించి .. శాలిబండలో ‘ఆక్సిజన్ డెంటల్ క్లినిక్’లో డాక్టర్‌గా చెలామణి అవుతూ వస్తు న్నాడు. అనుమానం వచ్చి పేషెంట్లు పోలీసులకు స మాచారం ఇవ్వడంతో అరె స్టు చేశారు. వరంగల్‌కు చెం దిన గిరిలాల్ భార్య సురేఖ వాణితో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి గిరిలాల్ ఫిజీషియన్‌గా, భార్య గైనకాలజిస్టుగా ప్రచారం చేసు కున్నారు. వీరు బోడుప్పల్, ఉప్పల్, శాలి బండ, శివం రోడ్డులో డాక్టర్లుగా చెలామణి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.