నకిలీ ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ గుట్టురట్టు

– నలుగురు నిందితుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నకిలీ ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ గుట్టును ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఫేక్‌ ఐడీకార్డులు, పాస్‌పోర్ట్స్‌, విదేశాలకు చెందిన పత్రాలు, బ్యాంక్‌ స్టేట్‌ మెంట్స్‌, రూ.18వేల నగదుతోపాటు రూ.7,02,970 నగదును బ్యాంక్‌లో ఫ్రీజ్‌ చేశారు. బుధవారం డీసీపీ జానకి మీడియాకు వివరాలను తెలిపారు. సికింద్రాబాద్‌కు చెందిన జీ.వీ.దుర్గా నాగేశ్వర సిద్ధార్డ్‌, ఓల్డ్‌ అల్వాల్‌కు చెందిన ఎన్‌.ప్రభాకర్‌ రావు, బోడుప్పల్‌కు చెందిన జీ.నాగరాజులు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. ఉన్నత చదువులకు, విజిటింగ్‌ వీసాపై అమెరికాతోపాటు ఇతర దేశాలకు వెళ్లేవారికి కావాల్సి వారికి నకిలీ పత్రాలను తయారుచేసి పంపిస్తు న్నారు. అందుకు ఒకొక్కరి నుంచి లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులతోపాటు పత్రాలు కొనుగోలు చేసిన నిజామాబాద్‌కు చెందిన జే.నాగేశ్వర్‌ని అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు డీ.జానకీ, మురళీధర్‌, ఇన్‌స్పెక్టర్‌ ఏ.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.