నెల రోజులు దాటినా తూకం వేయడం లేదని ఆవేదనతో రాస్తారోకో.. వంటావార్పు
నవతెలంగాణ – ఇల్లంతకుంట/ ములకలపల్లి
నెల రోజులు దాటినా ధాన్యం తూకం వేయక పోవడం.. కాంటా వేసినా పంటను తరలించడానికి లారీలు రాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. శనివారం రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆందోళన చేశారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపురం గ్రామానికి చెందిన 200మంది రైతులు మండుటెండలో పెద్దలింగపూర్-ఇల్లంతకుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి వంటావార్పు చేసుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు పసుల వెంకట్ వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజులుగా ధాన్యం తూకం వేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలింగపూర్లో ప్రతి సీజన్లో 25నుంచి 35వేల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినా నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయడం లేదన్నారు. లారీ డ్రైవర్లు బస్తాకు రూ.2చొప్పున వసూలు చేస్తున్నారని వాపోయారు. బస్తాకు 43కిలోలే తూకం వేస్తున్నారని, తరుగు ఎక్కువగా తీసుకున్నారని చెప్పారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా రోజుల తరబడి కేంద్రాల్లో ఉండటం వల్ల మిల్లుకు పోయాక తరుగు ఎక్కువ ఏర్పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్లలో తాలు పేరుతో, చిన్నగా ఉన్నా యంటూ బి.గ్రేడ్‌గా పరిగణిస్తున్నారని చెప్పారు. ఏఎస్ఐ మోతీరాం తన సిబ్బందితో వచ్చి ప్రయాణి కులకు దారి ఇవ్వాలని రైతులకు నచ్చజెప్పినా ససేమిరా అన్నారు. దీంతో ఏఎస్ఐ తహసీల్దార్‌కు, డీఎంకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా వారు రైతులతో మాట్లాడి ప్రతిరోజూ 3, 4లారీలను పంపిస్తామని హామీ ఇచ్చారు.
పాల్వంచ- ములకలపల్లి రహదారిపై రైతుల రాస్తారోకో
కొన్ని రోజులుగా కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ములకలపల్లి మండల కార్యదర్శి ఊకంటి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – ములకలపల్లి రహదారిపై మార్కెట్ యార్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కోతలు కోసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు భయాందోళనలో ఉన్నారన్నారు. ఇప్పటికే కురిసిన వర్షానికి ధాన్యం తడిసి రైతులు నష్టపోయారని తెలిపారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకొని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని కోరారు. మండల స్థాయి అధికారులు రైతుల పట్ల కక్ష సాధింపులు చర్యలు మానుకోవాలన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారి డీసీఓ ఎన్.వెంకటేశ్వర్లు రైతుల వద్దకు చేరుకొని మొత్తం ధాన్యాన్ని వారం రోజుల్లో కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు, ఊకంటి రాంబాబు, నిమ్మల మధు, చనగాని వినోద్, పశువుల సూర్య, ముదిగొండ ప్రశాంత్, గంప చంద్రబాబు, వాసం వెంకటేశ్వర్లు, తోటకూర మురళి, వనమా సత్యం, కె.శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.