– అలైన్మెంట్ మార్చాల్సిందే.. : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-చింతకాని
నాగపూర్ నుంచి అమరావతి వరకు నూతనంగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని కొదుమూరు, వందనం గ్రామాలకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకొని భూ సర్వే చేపట్టేందుకు ప్రయత్నించగా వారిని రైతులు అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కొండపర్తి గోవిందరావు అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండానే సర్వే ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు పరిహారం అందజేసే విషయంలో లిఖితపూర్వకంగా స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే సర్వే ప్రారంభించాలని సూచించారు. నూతన కలెక్టరేట్ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన పరిహారాన్ని గ్రీన్ ఫీల్డ్ రైతులకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, రెవెన్యూ అధికారులు సర్వే చేసి తీరుతామని చెప్పడంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సర్వే ప్రాంతంలో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టడంతో అధికారులు ఎట్టకేలకు సర్వే నిలిపివేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) చింతకాని, రఘునాధపాలెం మండలాల కార్యదర్శులు మడిపల్లి గోపాలరావు, నవీన్‌రెడ్డి, నాయకులు వత్సవాయి జానకి రాములు, రాచబంటి రాము, రైతు సంఘం నాయకులు కొల్లి సీతయ్య, పెంటాల అప్పారావు, వెంకటేశ్వర్లు, బొగ్గారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.