పార్టీల మ్యానిఫెస్టోల్లో రైతుల సమస్యలు చేర్చాలి

– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్‌
నవతెలంగాణ-కంటేశ్వర్ : నవంబర్‌ 30న రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో రైతాంగ సమస్యలు చేర్చాలని తెలంగాణ రైతు సంఘం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం నాందేవ్వాడలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జిల్లా అధ్యక్షులు గంగాదరప్ప, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం, రైతు సంఘం జిల్లా నాయకులు భీమన్న, లక్ష్మణ్, కేసరి పద్మ, సుశీల, అరిఫ్, ఉస్మాన్ ఖాన్, లక్ష్మి మాట్లాడారు.  పసుపు, ఎర్ర జొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. బోధన్, సారంగాపూర్ చక్కర ఫ్యాక్టరీ తెరవాలి.లబ్ధిదారులకు ఎన్ ఎస్ ఎఫ్ ఇచ్చిన భూములకు పట్టాలు ఇవ్వాలి.  సమగ్ర భూ సర్వే నిర్వహించి ధరణిలో ఉన్న లోపాలన్నింటిని పరిష్కరించాలి.  ప్రతి మూడు గ్రామాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాలి. జిల్లా స్థాయిలో భూసార పరీక్షలు జరిపి పంటల ప్రణాళికను రూపొందించాలి. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా పంటల ప్రణాళిక ఉండాలి.  రాష్ట్రానికి విత్తన చట్టం తప్పనిసరిగా ఉండాలి. నాణ్యతలేని విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆ తరువాత కంపెనీల నుండి వసూలు చేసుకోవాలి.  రాష్ట్రంలోని వ్యవసాయ బావులకు 24 గంటల నాణ్యమైన కరెంటు అందుబాటులో ఉంచాలి. విద్యుత్‌ షాక్‌ వల్ల రైతులు, పశువులు చనిపోయినచో వారికి రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లించాలి.సన్న, చిన్నకారు రైతుల రుణాలు మొత్తం మాఫి చేయలి. అకాల వర్షాలు, అధిక వర్షాలు, వడగండ్ల వాన, కరువులు, అడవి జంతువుల నుండి పంట నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వాలి. పంటలకు, రైతులకు భీమా సౌకర్యం వర్తింపజేయాలి. 18 నుండి 75 సంవత్సరాల వయస్సుగల రైతులకు రైతుబీమా వర్తింప జేయాలి.  రాష్ట్రంలో ధరల నిర్ణయాక కమీషన్‌ ఏర్పాటు చేయాలి. అన్ని పంటలకు సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం కలిపి నిర్ణయించే సూత్రం. (సి2+50) ప్రకారం మద్దతు ధరలను నిర్ణయించి కొనుగోళ్ళు చేయాలి. కౌలు రైతులను గుర్తించి 2011 చట్టం ప్రకారం వారికి ‘‘రుణ అర్హత కార్డులు’’ ఇవ్వాలి. పంట రుణాలు, పంటల బీమా, రైతుభీమా, ప్రభుత్వ పథకాలను కౌలు రైతులకు వర్తింపజేయాలి. 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. పోడు భూములు సాగు చేస్తున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. సహకార సంఘాలకు కేరళలో లాగా సహకార వ్యవస్థలో డిపాజిట్లు చేయాలి. స్వల్పకాలీక, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి. వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయాలి. రైతులకు అదనపు ఆదాయం వచ్చే విధంగా ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. చిన్న`మధ్యతరహా`భారీ ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. లిప్ట్‌ పథకాలకు విద్యుత్‌ సరఫరాను పెంచాలి. రాష్ట్ర ఇరిగేషన్‌ అభివృద్ధిశాఖ తరఫున పేదలకు కమ్యూనిటీ బోర్లు వేసి ప్రభుత్వమే నిర్వహించాలి.   57 సంవత్సరాలకు పైబడిన రైతుకు ప్రతినెల రూ.5,000 పెన్షన్‌ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ పథకాలు కూడా అమలు చేయాలి. వ్యవసాయోత్పత్తుల నిల్వకు గోదాంల సౌకర్యం కల్పించాలి. రైతుల వ్యవసాయోత్పత్తులను తాకట్టు పెట్టుకొని 75 శాతం రుణాలు ఇచ్చే ‘పథకాన్ని’ అమలు చేయాలి. రైతుల సమస్యలను పరిష్కారించడానికి జిల్లా స్థాయిలో అఖిలపక్ష రైతు సంఘాలతో కమిటీ వేయాలి. ఆ కమిటీ సూచనలను జిల్లా వ్యవసాయ రెవెన్యూ అధికారులు అమలు చేయాలి.