లఖింపూర్‌ ఖేరీ ఘటనపై జార్ఖండ్‌లో రైతులు, కార్మిక సంఘాలు నిరసన

రాంచీ : రెండేండ్ల క్రితం యూపీలోని లఖింపూర్‌ ఖేరీలో రైతుల హత్యకు వ్యతిరేకంగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ట్రేడ్‌ యూనియన్‌ సభ్యులు, రైతులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో బ్లాక్‌ డేగా పాటించారు. ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను తొలగించి, ప్రాసిక్యూట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 24న న్యూఢిల్లీలో సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు, సమాఖ్యల ఉమ్మడి వేదిక తరపున రైతులు, కార్మికుల అఖిల భారత జాయింట్‌ కన్వెన్షన్‌ ఈ పిలుపునిచ్చింది. ”మంత్రి, అతని కుమారుడు ఆశిష్‌ మిశ్రా తేనీ మారణకాండకు సూత్రధారులు. ఈ దాడిలో నలుగురు రైతులు నక్షత్ర సింగ్‌, గుర్విందర్‌ సింగ్‌, లవ్‌ప్రీత్‌ సింగ్‌, దల్జీత్‌ సింగ్‌, ఒక జర్నలిస్ట్‌ రమణ కశ్యప్‌ మరణించారు.
వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడానికి ఉద్దేశించిన మూడు కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చర్యలకు వ్యతిరేకంగా రైతుల ఐక్య పోరాటాన్ని అణిచివేసేందుకు బీజేపీ చేసిన కుట్రలో ఇది భాగమే” అని జంషెడ్‌పూర్‌కు చెందిన ఇంటూక్‌ నాయకుడు షహనాజ్‌ రఫీక్‌ ఆరోపించారు. రాంచీ, జంషెడ్‌పూర్‌, ధన్‌బాద్‌, బొకారో, జార్ఖండ్‌లోని ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసనలు జరిగాయి.