– నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి.. 22 మంది మృతి :దర్యాప్తునకు కేంద్రరైల్వేశాఖ ఆదేశం
ఐజ్వాల్ : మిజోరంలో ఘోరప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవటంతో 22 మంది కార్మికులు చనిపోయారు. రాజధాని నగరం ఐజ్వాల్‌కు 21కి.మీ దూరంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సైరంగ్ వద్ద నిర్మాణ పనులు జరుగుతోన్న సమయంలో ఈ వంతెన కూలింది. ప్రమాద సమయంలో అక్కడ 35 నుంచి 40 మంది కూలీలు ఉన్నట్టు సమాచారం. వారిల 22 మంది చనిపోగా, మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని తెలుస్తోంది. ఈ ఘటనపై మిజోరం ముఖ్యమంత్రి జొరామ్‌థంగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు10లక్షల ఎక్స్‌గ్రేషియో: రైల్వే మంత్రి ప్రకటన
మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 10లక్షలు, తీవ్ర గాయాలైన వారికి 2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. మిజోరం ఘటన దురదృష్టకరమన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలతో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం, రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో స్వల్ప గాయాలైన వారికి 50వేలు చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు ట్వీట్ చేశారు. వంతెన దుర్ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారికి రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వనున్నట్టు చెప్పారు.భైరవి-సైరంగ్ కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులోని 13 వంతెనలలో ఇది ఒకటి. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించినట్టు అధికారులు తెలిపారు.