ఒకచోట తండ్రి … మరో చోట తల్లి..

Father in one place... Mother in another place..– తమ పిల్లలకు విషమచ్చి చంపి.. వారూ ఆత్మహత్య
– హైదరాబాద్‌లో ఒకే రోజూ రెండు విషాద ఘటనలు
నవతెలంగాణ-కంటోన్మెంట్‌/జూబ్లీహిల్స్‌
హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు విషాద ఘటనలు చోటుచేసు కున్నాయి. కుటుంబకల హాలతో ఒక చోట ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు నిద్ర మాత్రలు ఇచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకోగా, మరో ఘటనలో ఓ తల్లి తన ఇద్దరు కొడుకులకు మానసిక ఎదుగులా సరిగా లేదని వారికి విషమిచ్చి చంపి తర్వాత తానూ ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లి భవాని నగర్‌లో శ్రీకాంత్‌ చారి(42) తన భార్య అక్షయ, ఇద్దరు కూతుర్లు స్రవంతి(8) శ్రావ్య(7)తో కలిసి నివసిస్తున్నాడు. అతను వెండి షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి భార్య, భర్తల మధ్య ఆర్థిక విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాంత్‌ చారి గురువారం రాత్రి సైనైడ్‌ తీసుకొచ్చి నిద్రలో ఉన్న కూతుర్లు స్రవంతి, శ్రావ్యకు తాగించాడు. పిల్లలు చనిపోవడంతో సైనైడ్‌ను భార్యకు కూడా ఇవ్వబోయాడు. భార్య తప్పించుకుని కిందికి వెళ్లిపోవడంతో శ్రీకాంత్‌ దాన్ని సేవించి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటన.. బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. బోరబండ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపిన వివరాలు ప్రకారం బోరబండ పీఎస్‌ పరిధిలోని రాజ్‌ నగర్‌ కాలనీలో నివాసముండే జ్యోతి(32) ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌గా బంజారాహిల్స్‌లో పనిచేస్తోంది. ఆమెకు ఐదేండ్ల క్రితం మేనబావ విజరు కుమార్‌తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు అర్జున్‌(4), ఆదిత్య(1). అయితే ఇద్దరు పిల్లల మానసిక ఎదుగుదలా సరిగ్గా లేదు. వివిధ హాస్పిటల్‌ల్లో చికిత్స చేయించినప్పటికీ కూడా ప్రయోజనం కలగలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం జ్యోతి తన ఇద్దరు కుమారులకు పాలలో విషం కలిపి ఇచ్చి, వారు చనిపోయారని భావించి బెడ్‌రూమ్‌లో డోర్‌ పెట్టుకొని కిటికీకి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త విజరు కుమార్‌, కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి ముగ్గురు కూడా చనిపోయి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీంతో క్షుణ్ణంగా తనిఖీ చేయించి పాయిజన్‌ బాటిల్‌ను, విషపు పాలను సీజ్‌ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. జ్యోతి తండ్రి వెంకటస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.