తప్పుడు వైరింగ్‌…కేబుల్‌ లోపాలు

– బాలాసోర్‌ ప్రమాదంపై సేఫ్టీ కమిషన్‌
న్యూఢిల్లీ : గతంలో చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టకుండా ఉండి ఉంటే బాలాసోర్‌ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఈ ఘటనపై విచారణ జరిపిన రైల్వే భద్రతా కమిషన్‌ (సీఆర్‌ఎస్‌) అభిప్రాయపడింది. లెవల్‌ క్రాసింగ్‌ లొకేషన్‌ బాక్స్‌లోని వైర్లను తప్పుగా కలిపారని, దీనిని సంవత్సరాల తరబడి ఎవరూ గుర్తించలేదని, దీనివల్ల నిర్వహణ పనులలో తేడా వచ్చిందని వివరించింది. నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత వైర్లను తిరిగి ఎలా కలపాలన్న విషయాన్ని టెక్నీషియన్లకు అర్థమయ్యేలా 2015లో వైరింగ్‌ డయాగ్రమ్‌ను మార్చి ఆమోదం పొందారని, అయితే దానిని భౌతికంగా మార్చలేదని తెలిపింది. దీనివల్ల కేబుల్‌ టర్మినల్‌ రాక్‌ తప్పుడు సర్క్యూట్‌ పేర్లను చూపించిందని సీఆర్‌ఎస్‌ విచారణలో తేలింది. రైలు దిశను కనిపెట్టే ‘పాయింట్‌’ను తెలుసుకునేందుకు 2018లో లొకేషన్‌ బాక్స్‌లో సర్క్యూట్‌ స్థానాన్ని మార్చారని, అయితే ఆ మార్పుకు అనుగుణంగా డయాగ్రమ్‌లో కానీ, టెర్మినల్‌ ర్యాక్‌లో కానీ వైర్లను కలపలేదని సీఆర్‌ఎస్‌ తెలిపింది. బాలాసోర్‌లో లొకేషన్‌ బాక్స్‌కు సంబంధించిన డయాగ్రమ్‌నే బహనగ బజార్‌లో కూడా వాడారని, అది తప్పుడు వైరింగ్‌కు దారి తీసిందని పేర్కొంది. లొకేషన్‌ బాక్స్‌ను రైలు పట్టాల వెంబడి అమరుస్తారు.’ప్రమాదం జరగడానికి కేవలం పది నిమిషాల ముందు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను లూప్‌లైన్‌ నుండి సాధారణ అప్‌ లైన్‌కు పంపేందుకు స్టేషన్‌ మాస్టర్‌ అను మతించారు. కొద్ది సెకన్ల తర్వాత మార్పును సూచించాల్సి ఉండగా వెంటనే సూచించారు. దీనికి 13-14 సెకన్ల సమయం పడుతుంది. వైరింగ్‌ సరిగా లేకపోవడం వల్లనే తప్పుడు సంకేతం అందింది. ఈ అసాధారణ పరిస్థితిని స్టేషన్‌ మాస్టర్‌ సిగలింగ్‌ సిబ్బందికి తెలియజేసి ఉండాల్సింది. కోర మాండల్‌ ప్రమాదానికి రెండు వారాల ముందు ఖరగ్‌పూర్‌ డివిజన్‌లో తప్పు డు వైరింగ్‌, కేబుల్‌ లోపాల కారణంగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత లోపాలను సరిదిద్దుకొని ఉంటే కోరమాండల్‌ ప్రమాదాన్ని నివా రించే అవకాశం ఉండేది. ఈ ప్రమాదానికి సిగలింగ్‌, ఆపరేషన్‌ (ట్రాఫిక్‌) విభాగాలు రెండూ బాధ్యత వహించాలి’ అని విచారణ కమిషన్‌ తెలిపింది.