– పలు దేశాల్లో మిశ్రమ ప్రతిస్పందనలు
బ్రస్సెల్స్ : అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టడం పట్ల యురోపియన్ యూనియన్ సభ్య దేశాల్లో పలువురిలో నిరాశవాదం నెలకొనగా ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాల్లో పలుచోట్ల మిశ్రమ ప్రతిస్పందనలు వెలువడుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ట్రంప్ వచ్చిన తర్వాత కేవలం అమెరికాకే మంచి జరగడం కాకుండా ఉక్రెయిన్‌లో, మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనడానికి, అమెరికా-చైనా సంబంధాల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి కూడా దోహదపడుతుందని మరికొందరు భావిస్తున్నారు. తన స్వప్రయోజనాలు నెరవేర్చుకునే దిశగా ‘అమెరికా ఫస్ట్’ అన్న ట్రంప్ నినాదం యూరప్‌ను తీవ్రంగా భయపెడుతోంది. ఈయూవ్యాప్తంగా 22శాతం మంది అమెరికాను మిత్రపక్షంగా భావిస్తుండగా, 51శాతం మంది అవసరమైన భాగస్వామిగా పేర్కొంటున్నాయి. 9శాతం మంది ప్రత్యర్ధిగా పేర్కొంటుండగా 3శాతం మంది ప్రతికూల శక్తిగా భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో 28,549మందిపై విదేశీ సంబంధాలపై యురోపియన్ కౌన్సిల్ (ఈసీఎఫ్‌ఆర్), ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా సర్వే చేశాయి. ట్రంప్ రెండోసారి పదవీకాలం పట్ల భారత్ చాలా ఆశాభావంతో వుంది. 82 నుంచి 85శాతం మంది అమెరికన్లకు ట్రంప్ మంచి చేస్తారని ఆశిస్తున్నారు. అలాగే భారత్‌తో పాటూ ప్రపంచానికి కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. చైనాలో 46శాతం మంది చైనా పట్ల మంచిగానే వ్యవహరిస్తారని ఆశిస్తున్నారు. మొత్తంగా ప్రపంచ దేశాలకు మంచి జరుగుతుందని 52శాతం భావిస్తున్నారు. ఇక అమెరికా మిత్రపక్షాలైన బ్రిటన్, కొరియా రిపబ్లిక్, ఇయు సభ్య దేశాల్లోని ప్రజలైతే ట్రంప్ పాలన పట్ల చాలా సందేహలు వ్యక్తం చేస్తున్నారు. యురోపియన్ మిత్రపక్షాలే ఎక్కువ నిరాశావాదాన్ని ప్రకటించాయి. రాబోయే ట్రంప్ ప్రభుత్వం వల్ల అమెరికన్లకు ఎదురు దెబ్బ తగులుతుందని, అలాగే అంతర్జాతీయ ఘర్షణల పరిష్కారానికి కూడా విఘాతం కలుగుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఇక రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో అయితే ట్రంప్ పట్ల ఈయూ కన్నా అధ్వాన్నంగా ప్రజాభిప్రాయం నెలకొంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మోస్తరు దేశాలన్నీ ప్రపంచ పోలీస్‌మేన్‌గా ఇక అమెరికాను కొనసాగించేది లేదని భావిస్తున్నాయి. కాగా ఈయూలోనే మరో భాగం ట్రంప్‌ను స్వాగతిస్తోంది. ప్రధానంగా ఇటలీ ప్రధాని మెలోనికి ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి.