ఫిదా ఫలూదా…

ఫిదా ఫలూదా...ఈ సారి ఫిబ్రవరి లోనే వేసవి వచ్చేసింది. పగటి పూట వేడి గాలులు మెల్లమెల్లగా పెరుగు తున్నాయి. ఇంకొద్ది రోజులయితే భానుడు తన ప్రతాపాన్ని ఇంక చూపించక మానడు… పగలంతా సూర్యుడి భగభగలకు బలికాక తప్పదు.. మరి ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే అందరూ చల్లని చల్లని పానీయాలను ప్రిఫర్‌ చేస్తారు. కడుపులో చల్లగా అంటే… ఏది పడితే అది తాగితే అనారోగ్యాల పాలు కాక తప్పదు. దీనితో పాటు ఇంట్లో రెగ్యులర్‌గా చేసుకునే నిమ్మకాయ, మజ్జిగ లతో ఫ్రూట్‌ జ్యూస్‌ల లాంటివి కాకుండా కొంచెం వెరైటీగా టేస్ట్‌ చేద్దాం అనుకుంటే ఫలూదా ప్రయత్నించాల్సిందే. పిల్లలు, పెద్దలు కూడా తాగేందుకు బాగా ఆసక్తి చూపుతారు. అంతే కాదు, బయటి ఆహారంపై భద్రత ఉండదు కూడానూ. మరి ఇంట్లోనే ఫ్రూట్‌ ఫలూదా ఎలా తయారు చేసుకో వచ్చో ఓ సారి చూసేద్దామా..
ఫ్రూట్‌తో…
కావాల్సిన పదార్ధాలు : ఫలూదా (సబ్జా గింజలు) – రెండు చెంచాలు, సేమ్యా – అర కప్పు, పాలు – ఒకకప్పు, యాపిల్‌, అరటి – సగం ముక్క, పైనాపిల్‌ – పావు ముక్క, దానిమ్మ గింజలు – పావు కప్పు, రోజ్‌ సిరప్‌ – ఒక చెంచా, కండెన్స్‌డ్‌ మిల్క్‌ – పావు కప్పు
తయారు చేసే విధానం : ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసి సేమ్యాను సగం ఉడికేలా చేసుకుని సిద్ధంగా పెట్టుకోవాలి. ఒక పొడవాటి గాజు గ్లాసును తీసుకుని, రెడీ చేసి పెట్టుకున్న సేమ్యాను అందులో వేసుకోవాలి. మరిగించి చల్లార్చి పెట్టుకున్న పాలను ఇందులో పోయాలి. నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి. ఇప్పుడు చెంచాడు రోజ్‌ సిరప్‌ వేసుకోవాలి. తర్వాత యాపిల్‌, అరటి, పైనాపిల్‌ ముక్కలను చిన్నగా కట్‌ చేసి వేసుకోవాలి. ఇందులోనే కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్‌ను రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత బయటకు తీసి దానిమ్మ గింజలతో అలంకరించాలి. అంతే కూల్‌ కూల్‌ ఫలూదా రెడీ.
రాయల్‌ …
కావాల్సిన పదార్ధాలు : నీళ్లు – రెండు కప్పులు, వెర్మిసెల్లి – అర కప్పు, సబ్జా – మూడు చెంచాలు, పాలు – ఒక గ్లాసు, చెక్కెర – ఒక చెంచా, రోజ్‌ సిరప్‌ – రెండు చెంచాలు, కాజు, బాదం, పిస్తా – అర కప్పు (చాప్‌ చేసుకుని పెట్టుకోవాలి), ఐస్‌ – ఒక చిన్న క్యూబ్‌, టూటీ ఫ్రూటీ – మూడు చెంచాలు, వెనీలా ఐస్‌ క్రీమ్‌ – అర కప్పు
తయారు చేసే విధానం : స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా కాగాక వెర్మిసెల్లి వేసి సన్న మంట మీద ఉడికించాలి. ఈ వెర్మిసెల్లి ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి బాగా చల్లారనివ్వాలి. సబ్జా నాలుగు గంటల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక గ్లాసు కాగబెట్టిన పాలు తీసుకుని అందులో చెక్కెర, ఒక చెంచా రోజ్‌సిరప్‌ వేసి బాగా కలపాలి. ఐస్‌ క్యూబ్‌ను క్రష్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్‌ తీసుకుని అందులో రెండు చెంచాల సబ్జా, ఐస్‌, రెండు చెంచాల వెర్మిసెల్లి, టూటీ ఫ్రూటీ రెండు చెంచాలు, ఒక చెంచా రోజ్‌ సిరప్‌ తర్వాత మిగిలిన సబ్జా, వెర్మిసెల్లి, టూటీఫ్రూటీ, వెనీలా ఐస్‌ క్రీమ్‌ అర కప్పు, కలిపి పెట్టుకున్న పాలు అన్ని వేసుకుని పైన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే సరి.