పాలికా బజార్‌లో అగ్నిప్రమాదం

– అగ్నికి దగ్ధ్దమైన బట్టల దుకాణం
– మూడు ఫైర్‌ ఇంజన్లతో మంటలు అదుపు
– షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల బట్టల దుకాణంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మోండా డివిజన్‌ పరిధి పాలికాబ జార్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్‌మోల్‌ సెలెక్షన్‌, అన్‌మోల్‌ కిడ్స్‌ వేర్‌, రెడీమెడ్‌ బట్టల షాప్‌లో ఆదివారం ఉదయం ఐదు గంటలకు దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో మూడు ఫైర్‌ ఇంజన్లతో మంటలు అదుపు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, షార్టుసర్య్కూట్‌ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని, ఆ సమయంలో జన సంచారంతో పాటు షాపుల్లో పనివాళ్ళు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. ప్రమాదానికి గురైన షాపునకు ఆనుకునే చాలా షాపులు, లాడ్జీ ఉండటం వల్ల వారు కొంచెం సేపు భయాందోళనలకు గురయ్యినట్టు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్టు ఫైర్‌ అధికారులు, స్థానిక పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని స్థానిక కార్పొరేటర్‌ దీపిక పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ప్రత్యేక బృందం సహాయక చర్యలు చేపట్టారు.