ముంబయిలో అగ్ని ప్రమాదం

Fire in Mumbai– ఏడుగురి సజీవ దహనం
– 40 మందికి గాయాలు
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గోరేగావ్‌ ప్రాంతంలో ఒక ఏడు అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోరేగావ్‌ ప్రాంతంలోని పశ్చిమ అజాద్‌ నగర్‌ లోకాలిటీలోని జై భవాని భవనంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా భవనమంతా వ్యాపించాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మైనర్లుసహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు