ఎన్నికల ప్రణాళికల్లో మత్స్యకారుల సమస్యలు

In election plans
Fishermen's problems–  అన్ని రాజకీయ పార్టీలు చేర్చాలి: విస్తృత సమావేశంలో లెల్లెల బాలకృష్ణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మత్స్యకారులు, మత్స్యకార్మికుల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలపై వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆయా పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని అఖిల భారత మత్స్యకారులు, మత్స్యకార్మిక సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు లెల్లెల బాలకృష్ణ డిమాండ్‌ చేశారు.మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం అధ్యక్షులు గోరెంకల నర్సింహా అధ్యక్షతన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో చేప,రోయ్య పిల్లల పంపిణీలో ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే కొందరు భారీ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. వాటి నాణ్యతలో లోపాలున్నాయని తెలిపారు. చేప, రొయ్య పిల్లల కొనుగోలుకు సొసైటీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేయాలని ఎన్ని సార్లు ఆందోళన చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వృత్తిలో ప్రమాదాలకు గురై చనిపోతున్నా వారిని ఆదుకోవటం లేదని తెలిపారు. పెండింగ్‌ ఇన్సూరెన్స్‌, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం పథకాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25నజిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలనీ, వచ్చే నెల 3న మత్స్యకార భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు. మత్స్యకార సామాజిక వర్గాలకు రాజకీయంగా సాధారణ ఎన్నికల్లో అన్యాయం చేసే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ మత్స్యకార శ్రామిక సహకార సంఘాల సమాఖ్యకు అప్రజాస్వామికంగా చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ను నామినేట్‌ చేయడం తగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్‌ శంకర్‌, ముటా దశరథ్‌,పగడాల నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శులు కొప్పు పద్మ, గొడుగు వెంకట్‌, ఎం రమేశ్‌ రాష్ట్ర నాయకులు జి కనకతార,సిహెచ్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.