ప్రవీణ్‌ పెన్‌డ్రైవ్‌లో మరో ఐదు ప్రశ్నాపత్రాలు

– లీకేజీ కేసులో మరిన్ని సంచలనాలు ొదర్యాప్తు వేగవంతం
– సిట్‌ ఎదుట అంగీకరించిన నిందితులు ?
– డబ్బుల గొడవతోనే విషయం బయటకు?
– ఒక్కొక్కరి నుంచి రూ.10లక్షలు ఇచ్చేవిధంగా ఒప్పందం
– పూర్తి వివరాలకు నిందితులను కస్టడీకి కోరిన పోలీసులు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తును సిట్‌ వేగవంతం చేసింది. ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ అధికారులిచ్చిన ఫిర్యాదుతో బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ కంప్యూటర్‌ నుంచి మొత్తం ఐదు ప్రశ్నాపత్రాలు తీసుకున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను సేకరించిన అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న వారినుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది.
నవతెలంగాణ-సిటీబ్యూరో
సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో రేణుక పథకం ప్రకారం ప్రవీణ్‌ను కలిసిందని తెలుస్తోంది. ప్రవీణ్‌తో రూ.10లక్షల బేరం కుదుర్చుకున్న రేణుక ఆ తర్వాత ఒక్కొక్క అభ్యర్థి నుంచి అందినకాడికి దండుకోవాలని ఆలోచన చేసినట్టు తెలిసింది. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్‌ నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఆట్ల రాజశేఖర్‌రెడ్డితో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. ఈ నెల 2న పేపర్స్‌ లీక్‌ చేసినా చివరకు రాజశేఖర్‌కు డబ్బులు చెల్లించలేదని తెలిసింది.
డబ్బుల వద్ద గొడవ..
ఒప్పదం ప్రకారం ప్రవీణ్‌కు రూ.5లక్షలు చెల్లించిన రేణుక.. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత మరో రూ.5లక్షలు చెల్లించింది. అప్పటికే మేడ్చెల్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌ ద్వారా నీలేశ్‌, శ్రీను రేణుకకు పరిచయమయ్యారు.
ఒక్కొక్కరితో రూ.10లక్షల ఒప్పందం చేసుకుంది. ఇద్దరు కలిసి రూ.13లక్షల 50వేలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని పరీక్ష తర్వాత చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పరీక్షకు ముందురోజు ఇద్దరిని వనపర్తిలోని తన ఇంటికి తీసుకెళ్లింది. తన తమ్ముడు రాజేశ్‌నాయక్‌ పై అంతస్తులో ఉండగా.. అక్కడే వారితో ప్రశ్నలకు జవాబులను ప్రాక్టీస్‌ చేయించింది. 5న నిర్వహించిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షకు భర్తతో కలిసి తన కారులోనే ఆ ఇద్దరు అభ్యర్థులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించుకొని తీసుకొచ్చింది. ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని రేణుక డిమాండ్‌ చేసింది. అయితే తమ వద్ద డబ్బులేదని, ఇవ్వలేమనడంతో వారి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్ర స్థాయిలో గొడవ జరగడంతో ఆవేశానికి లోనైన నీలేశ్‌నాయక్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేసి విషయం పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది. దాంతో వీరి బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది.
మహిళల సన్నిహితంపై ప్రత్యేక దృష్టి
2017 నుంచి ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌ డేటాను పోలీసులు సేకరించారు. అందులో కొంతమంది మహిళలు ప్రవీణ్‌తో సన్నిహితంగా వ్యవహరించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించినట్టు సమాచారం. కొందరు మహిళలు అర్ధనగంగా, మరికొందరు నగంగా చాటింగ్‌ చేసినట్టు గుర్తించారు. ప్రవీణ్‌తో వారికున్న లింక్‌ ఏంటని సిట్‌ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. సిట్‌ వారందరినీ విచారణకు పిలుస్తుందా లేదా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, నిందితుడు ప్రవీణ్‌ ఏఈ ప్రశ్నాపత్రాన్ని రేణుకకు విక్రయించగా, మిగిలిన ప్రశ్నాపత్రాలను ఎవరికి విక్రయించాడనే దానిపై సిట్‌ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. అయితే ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉండటంతో ఎలాంటి వివరాలూ వెల్లడించలేమని సిట్‌ అధికారులు
తెలిపారు.
కంప్యూటర్‌ నుంచి ఐదు ప్రశ్నాపత్రాలు
ఏఈ ప్రశ్నాపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టీఎస్‌పీఎస్సీ అధికారులు మార్చి 5న జరిగిన అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రవీణ్‌ దగ్గర ఉన్న పెన్‌ డ్రైవ్‌లో మరికొన్ని ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నట్టు సిట్‌ అధికారులు అనుమానిం చారు. దాంతో 9మంది నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లతోపాటు పెన్‌డ్రైవ్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. వాటిని విశ్లేషించి కంప్యూటర్‌ నుంచి ఏఈ ప్రశ్నాపత్రంతోపాటు టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశ్నాపత్రాలను కూడా ప్రవీణ్‌ కొట్టేసినట్టు సిట్‌ గుర్తించింది. ఒప్పందం ప్రకారం రాజశేఖర్‌ కంప్యూటర్‌ లాన్‌లో మార్పులు చేశాడని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలను రాబట్టేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి అభిప్రాయపడ్డారు.