తెలంగాణలో ఐదు విప్లవాలు సాధించాం ధాన్యం ఉత్పత్తిలో నెంబర్‌వన్‌

– సిరిసిల్లలో 370ఎకరాల్లో మెగా అక్వాహబ్‌ :పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
– రాష్ట్రంలో రూ.3,500కోట్ల పెట్టుబడులు :లులూ గ్రూప్‌ చైర్మెన్‌ యూసఫ్‌ అలీ
– ఒప్పంద పత్రాలు మార్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం, లులూగ్రూప్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం హరిత, శ్వేత, నీలి, గులాభీ, పసుపు విప్లవాల్లో విజయం సాధిచిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తలసరి ఆదాయం రెట్టింపైందని అన్నారు. అబుదాబికి చెందిన లులూ గ్రూప్‌ హైదరాబాద్‌ బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హౌటల్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిం చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం, లులూ గ్రూప్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని వెల్లడించారు.హరిత విప్లవంలో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు. 68లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 3.5కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని, తెలంగాణ పత్తి దేశంలోనే నాణ్యమైందని చెప్పారు. నీటిపారుదల రంగంలో వచ్చిన మార్పుల కారణంగా 46వేల చెరువులు, కుంటలు, భారీ ప్రాజెక్టుల్లో చేపల పంపెకం పెరిగిందని తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 370 ఎకరాల్లో ఆక్వా హబ్‌ను ఏర్పాటు చేయనున్నామని, దీంతో నీలి విప్లవంలోనూ విజయం సాధించామని తెలిపారు. గొర్రెల పెంపకం, ప్రభుత్వం అందిస్తున్న మేకలు, గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఉత్పత్తి పెరిగిందని, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే దశకు చేరుకున్నామని, దీంతో పింక్‌ విప్లవం సాధించామని చెప్పారు. విజయడెయిరీ ద్వారా పాల ఉత్పత్తి 380శాతం పెరిగిందని, ప్రభుత్వ, ప్రయివేటు, కో-ఆపరేటివ్‌ డెయిరీల ద్వారా పాల ఉత్పత్తి 5లక్షల లీటర్లకు పెరిగిందన్నారు.300ఎకరాల్లో మెగా డెయిరీ నిర్మించనున్నామని, దీంతో శ్వేత విప్లవం సాధించామని తెలిపారు. ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆయిల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయనున్నామని, దీంతో పసుపుపచ్చ విప్లవాన్ని కూడా సాధించామని వివరించారు. 10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రకంగా తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని అన్నారు. లులూ సంస్థ పెట్టుబడులతో టూరిజం పెరుగుతుందని భావిస్తు న్నామన్నారు. ఆ సంస్థ చైర్మెన్‌ యూసుఫ్‌ అలీ మాట్లాడుతూ తెలంగాణలో ఐదేండ్లల్లో రూ.3,500కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఇతర ఆహార పదార్థాల ప్రాసెసింగ్‌, ఎగుమతులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించ నున్నట్టు తెలిపారు.రూ.300కోట్లతో మంజీరామాల్‌లో లులూ గ్రూప్‌ షాపింగ్‌మాల్‌, హైపర్‌మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సంబంధించిన పనులు 80శాతం పూర్తయ్యాయని, ఆగష్టులో ప్రారంభించే అవకాశముంద న్నారు. దీనిలో ఐదు సినిమా హాళ్లు, 1400మంది సామర్థ్యంతో కూడిన మల్టీక్యూసెన్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో రెండు వేల మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రూ.రెండు వేల కోట్లతో హైదరాబాద్‌ శివారుప్రాంతాల్లో మినీమాల్స్‌, వెయ్యి కోట్లతో నగరాల్లో మాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచంలోని ఇతర దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో రూ.150కోట్లతో లాజిస్టిక్‌ హబ్‌ను సైతం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. బియ్యం ప్రాసెసింగ్‌, చేపలు, మాంసం ఉత్పత్తుల ప్రాసెసింగ్‌, ఎగుమతికి సంబంధించిన యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హా, పరిశ్రమల శాఖ ఎండీ వెంకట నరసింహారెడ్డి, అదనపు కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, లులూ ఎగ్జీక్యూటీవ్‌ డైరెక్టర్‌ అశ్రఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.