పరిశోధనలపై దృష్టి పెట్టాలి

– ఎన్టీయూ వైస్‌ ప్రెసిడెంట్‌ టీమ్‌ వైట్‌
– ఉన్నత విద్యామండలిని సందర్శించిన సింగపూర్‌ బృందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్‌ టెక్నాలాజికల్‌ యూనివర్సిటీ (ఎన్టీయూ) ప్రతినిధి బృందం సోమవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని సందర్శించింది. ఉన్నత విద్యా మండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి అధ్యక్షతన తెలంగాణ వర్సిటీల వీసీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఎన్టీయూ వైస్‌ ప్రెసిడెంట్‌ టీమ్‌ వైట్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇండియా స్ట్రాటజీ బివిఆర్‌ చౌదరి, గ్లోబల్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ప్రీతి దావ్రా, గ్లోబల్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ సింగ్‌, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు వి వెంకట రమణ, ఎస్‌కే మహమూద్‌, వీసీలు డి రవీందర్‌, టి రమేష్‌, సిహెచ్‌ గోపాల్‌రెడ్డి, కట్టా నర్సింహ్మారెడ్డి, కవిత దర్యాణి, విజ్జులత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమ్‌ వైట్‌ మాట్లాడుతూ పరిశోధన రంగంపై దృష్టిపెట్టాల్సిన అవసరముందని చెప్పారు. సింగపూర్‌లోని ఎన్టీయూలో నిర్వహిస్తున్న అత్యాధు నిక పరిశోధనలను ఆయన వివరించారు. పరిశ్రమ అవసరాలకు తగిన పరిశోధన, ఆచరణాత్మక ఆవిష్కరణలపై దృష్టిసారించడం వల్ల తక్కువ కాలంలోనే ఎన్టీయూ ప్రపంచంలోనే ప్రముఖ వర్సిటీ గా ఎదిగిందన్నారు. తమతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఉన్నత విద్యామండలి సిద్ధంగా ఉందని వివరించారు. రాబోయే కొన్నేండ్లలో విశ్వ విద్యాలయాల అధ్యాపకులు పరిశోధనల్లో నిమగం కావడానికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ ఒప్పం దం వల్ల విద్యాసంబంధ సహకారం, ఉమ్మడి పరిశో ధన, అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి సెమినార్లు, సింపోజియంలను నిర్వహించడం వంటి అవకాశాలను అన్వేషించడానికి వీలవుతుందని లింబాద్రి అన్నారు.