బ్యాటర్లపైనే ఫోకస్‌

– రాత్రి 7.30 నుంచి స్పోర్ట్స్‌18లో..
– సిరీస్‌ విజయంపై భారత్‌ గురి
– ఐర్లాండ్‌తో రెండో టీ20 నేడు
నవతెలంగాణ-డబ్లిన్‌ : వర్షం అంతరాయంతో భారత్‌, ఐర్లాండ్‌ తొలి టీ20 అర్థాంతరంగా నిలిచిపోయింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. డబ్లిన్‌ పోరులో భారత బౌలర్లు విజృంభించారు. ప్రత్యేకించి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జశ్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్‌ కృష్ణలు రెండేసి వికెట్లతో సత్తా చాటారు. రెండు ఓవర్ల స్పెల్‌తో ఒకింత మ్యాచ్‌ ఫిట్‌నెస్‌, ఫామ్‌ నిరూపించుకునే ప్రయత్నంలో విజయవంతం అయ్యారు. ఛేదనకు వరుణుడు అడ్డు నిలువగా.. నేడు రెండో టీ20లో భారత బ్యాటర్లపై ఫోకస్‌ పడింది. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌లు సెలక్షన్‌ కమిటీ మెప్పు పొందేందుకు ధనాధన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడేందుకు ఎదురు చూస్తున్నారు.
సిరీస్‌ పడతారా? : డబ్లిన్‌లో ఆడిన ఐదు మ్యాచుల్లోనూ భారత్‌ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓ దశలో 59/6తో వందలోపే కుప్పకూలేలా కనిపించినా.. లోయర్‌ ఆర్డర్‌ మెరుపులతో ఆతిథ్య జట్టు మంచి స్కోరు సాధించింది. చివర్లో బారీ మెక్‌కార్టీ, కర్టీస్‌ కాంపెర్‌లు ఆకట్టుకునే ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. నేటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌కు కోలుకునే అవకాశమే లేకుండా.. మరింత స్వల్ప స్కోరుకు పరిమితం చేయాలని భారత్‌ భావిస్తోంది.
రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌లు సెలక్షన్‌ కమిటీ ప్రణాళికల్లో కనిపిస్తున్నారు. పసికూన ఐర్లాండ్‌పై భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని బ్యాటర్లు భావిస్తున్నారు. నేటి మ్యాచ్‌లో టాస్‌ నెగ్గితే భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. రవి బిష్ణోరు, వాషింగ్టన్‌ సుందర్‌, రింకూ సింగ్‌, శివం దూబెలు సత్తా చాటాలని చూస్తున్నారు.