ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇది ఇంతకు ముందు మిమ్మల్ని మీరు అడిగిన ప్రశ్న కాకపోవచ్చు. ఎందుకంటే మనం ఆలోచించే విధానం, ఆలోచించడానికి ఎంచుకున్న విషయాలు, జీవించే విధానంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
ఆలోచనల్ని నియంత్రించడం ఎప్పుడూ సులభం కాదు. ప్రతికూల ఆలోచనా విధానాల నుండి బయటపడడం ఎలాగో తెలుసుకోవడానికి చాలా సమయం, శ్రమ పడుతుంది. కానీ ఇది విలువైన ప్రయత్నం. విషయమేమిటంటే, జీవితంలో ఎదురయ్యే అనేక అంశాలు మిమ్మల్ని చురుకుగా వెనక్కి నెట్టివేస్తాయి. పనికిరాని అంశాల గురించి ఆలోచించకుండా ఉండడమే ఉత్తమం.
గత గాయం
గాయం జీవితంలో దురదృష్టకరమైన భాగం. ఇది అధికారుల నుండి దుర్వినియోగం, నిర్లక్ష్యం, విఫలమైన సంబంధాలు, ఒంటరితనం, బెదిరింపులు, ప్రకృతి వైపరీత్యాలు, తల్లిదండ్రులు… ఇలా అనేక రూపాల్లో రావచ్చు. ఈ గాయాలు మన మెదడును, వ్యక్తిత్వాన్ని పూర్తిగా భిన్నమైన వ్యక్తులుగా మార్చడానికి అవకాశముంది. మనసు గాయపడడం వల్ల భౌతిక, శారీరక మార్పులు రావచ్చు. ఈ మార్పులు గాయాన్ని మరచిపోకుండా చేస్తాయి. కొన్ని గాయాల్ని మర్చిపోవడానికి జీవితకాలం పట్టొచ్చు. కానీ ఆ నొప్పిని అధిగమించడానికి అవసరమైతే ఆప్తుల, నమ్మకస్తుల సహాయం తీసుకోవచ్చు. మానసిక, ఆరోగ్య నిపుణులనూ సంప్రదించాలి.
నష్టం
గాయం లాగనే నష్టం కూడా మనల్ని జీవితాంతం వెంటాడుతూ వుంటుంది. మనం ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకున్నా, పోగొట్టుకున్నా ఆ దు:ఖం జీవితాంతం ఉంటుంది. నష్టాన్నైనా, కష్టాన్నైనా మర్చిపోవడానికి సమయం పడుతుంది. కొన్ని సార్లు అది తక్కువ సమయం కావచ్చు, మరికొన్నిసార్లు ఎక్కువ సమయం తీసుకోవచ్చు.
నష్టానికి సంబంధించిన భావాలు చాలా శక్తివంతంగా వుంటాయి. వాటికి దూరంగా వుండాలని ప్రయత్నించినా వీలవదు. చివరికి వాటితోనే జీవించడం నేర్చుకుంటాం. మీరు కోల్పోయిన వ్యక్తిని ఆరోగ్యకరమైన రీతిలో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. అన్నింటికంటే ముఖ్యమైనది ఎప్పుడూ గతాన్ని తవ్వుకుంటూ, నష్టాన్ని మాత్రమే తలచుకుంటుంటే ముందుకు సాగలేరు.
పోలిక
మన చుట్టూ వున్నవారికి ఏం వున్నాయి, వారేం చేస్తున్నారు అని తరచూ పోల్చుకుంటే జీవితంలో ముందుకు సాగలేరు. ఈ ఆలోచన చాలా ప్రమాదకరమైనది. కానీ ప్రస్తుతం మనం పోలిక ప్రపంచంలో జీవిస్తున్నాం. పోలిక చాలా ప్రమాదకరమైనది. మనకంటే మెరుగ్గా పనిచేస్తున్నారని భావించే వ్యక్తులతో మనల్ని పోల్చుకోవడం వల్ల ఆత్మగౌరవంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ వద్ద లేని వాటిని కోరుకునేలా చేస్తుంది. ఇది మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతుంది.
ప్రపంచంలోని అన్యాయం
ఇది గమ్మత్తైనది. మనం అన్యాయమైన ప్రపంచంలో జీవిస్తున్నామా? ఉదాహరణకు, అమెరికాలో ప్రతి సంవత్సరం 3,00,000 మరణాలకు కారణం ఊబకాయం. ప్రపంచంలోని ఇతర చోట్ల, 800 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలకు తగినంత ఆహారం దొరకడం లేదు. సమాజంలోని అసమానతలతో నిరాశ్రయులైన ప్రజలు ఇబ్బంది పడటాన్ని ప్రపంచవ్యాప్తంగా చూడొచ్చు. అన్యాయాన్ని ఎదిరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు మేలు జరగదు. వాస్తవానికి, ప్రపంచంలో తప్పుగా ఉన్న ప్రతి దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం వల్ల మీరు నిస్సహాయత, నిరాశకు లోనవుతారు. సమసమాజం కోరుకుంటే దాని కోసం పని చేయండి. కానీ మీ జీవితాన్ని అన్యాయం చేసుకోవద్దు.
కోల్పోయిన అవకాశాలు
కోల్పోయిన వాటి గురించి ఆలోచించడం సహజం. మీకు వచ్చిన ఉద్యోగాన్ని చేస్తూ కొత్త నగరానికి మారినట్లయితే? మీ పుస్తకాన్ని మిలియన్ల మందికి ప్రచారం చేయడంలో సహాయపడే టీవీ షోలో ఇంటర్వ్యూను పొందినట్లయితే… ఇదంతా బాగుంటుంది. కానీ ఇబ్బంది ఏమిటంటే, అదే సమయంలో మీకు వచ్చిన మరో అవకాశాన్ని వదులుకున్నట్లయితే, ఆ వదిలేసిన అవకాశం ఏ సుదూరాలకు తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదు. అయితే ఆ వదిలేసిన అవకాశాల గురించి మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు అందుబాటులో ఉన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేసినట్లే. కాబట్టి లేనిదాని గురించి ఆలోచించడం మానేసి ప్రస్తుతమున్నదాన్లో అభివృద్ధికి ఏం చేయాలో దానిపై దృష్టి పెట్టాలి.
నియంత్రించలేని విషయాలు
జీవితంలో ప్రధానమైనది, అతి ముఖ్యమైనది మనం చేయగలిగిన పనులను, చేయలేని పనులను సెపరేట్ చేయడం. విషయాలను గుర్తించడం, వేరు చేయడం. సమాజంలో కరోనా వంటి మహమ్మారి నుండి యుద్ధం వరకు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. కానీ అవి మన నియంత్రణలో లేవు. బాహ్య పరిస్థితులకు మనం ఎలా ప్రతిస్పందిస్తామో మాత్రమే మనం నియంత్రించగలం. నిరంతరం చెడు వార్తలపైనే దృష్టిపెడుతుంటే చివరికి నియంత్రించగల విషయాలపై దృష్టి పెట్టడానికి మీకు శక్తి ఉండదు. కాబట్టి మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే, ఈ జీవితంలో మీరు ఏమి నియంత్రించ గలరు, నియంత్రించలేరు. నియంత్రించలేని వాటిపై దృష్టి పెట్టడం మానేసి, మీరు చేయగలిగిన వాటిపై దృష్టి పెట్టండి.
డా|| హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్