మోత్కూరు బాలుర గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌

– 34 మంది విద్యార్థులకు అస్వస్థత
– పీహెచ్‌సీలో చికిత్స
– విచారణకు ఆదేశించిన కలెక్టర్‌
– పాఠశాలను సందర్శించిన ఆర్సీవో, డిప్యూటీ డీఎంహెచ్‌వో
– ఫుడ్‌ శ్యాంపిల్‌ సేకరించిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌
నవతెలంగాణ-మోత్కూరు
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్‌ కేంద్రంలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షి యల్‌ బాలుర పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో 34మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులు, పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచడంతో శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా బయటకు పొక్కింది. వివరాల్లోకి వెళితే..
మున్సిపల్‌ కేంద్రంలో రెండు భవనాలను అద్దెకు తీసుకుని పాఠశాల నిర్వహిస్తున్నారు. వడ్డెర కాలనీ వద్ద భవనంలో 8వ తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు 263 మంది విద్యార్థులు ఉన్నారు. కొత్త బస్టాండ్‌ వద్ద మూతపడిన ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల భవనంలో 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 261 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన 8వ తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల్లో 34 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ మంగమ్మ, ఉపాధ్యాయులు విద్యార్థులను వెంటనే 108లో మోత్కూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి హేమంత్‌ కుమార్‌, డాక్టర్‌ నిరోశ విద్యార్థులకు సెలైన్లు ఎక్కించి చికిత్స చేశారు. విద్యార్థులంతా కొంతమేర కోలుకోవడంతో ఉదయం వరకు ఆస్పత్రిలోనే ఉంచితే విషయం బయటకు తెలుస్తుందన్న ఉద్దేశంతో శనివారం తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల సమయంలోనే అందరినీ తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటస్వామి కలెక్టర్‌ పమేలా సత్పతికి తెలియజేయడంతో విచారణకు ఆదేశించారు. గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ రజిని, డీసీవో శ్రీరాం శ్రీనివాస్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, పీవోఎన్సీడీ డాక్టర్‌ సుమన్‌ కల్యాణ్‌ శనివారం పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు విద్యార్థులను వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నారు. ఫుడ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ స్వాతి పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పెట్టిన భోజనం శాంపిల్స్‌ సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపారు. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతోనే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, విద్యార్థులంతా పూర్తిగా కోలుకున్నారని గురుకులాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ రజిని, పీహెచ్‌సీ వైద్యాధికారి హేమంత్‌ కుమార్‌ తెలిపారు.