ఓపీఎస్‌ సాధనకోసం 23న రాష్ట్రస్థాయి సదస్సు

– 17 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిర్ణయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నూతన పెన్షన్‌ విధానాన్ని (ఎన్‌పీఎస్‌) రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్నే (ఓపీఎస్‌) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జులై 23వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి ఐక్య సదస్సు నిర్వహిస్తున్నట్టు జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓపీఎస్‌ (జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) ప్రకటించింది. 17 కార్మిక సంఘాలతో కూడిన ఈ ఫోరం ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ (ఎస్‌సీఆర్‌ఎమ్‌యూ) రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఎస్‌సీఆర్‌ఎమ్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సీహెచ్‌ శంకరరావు, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ (సీసీజీఈడబ్ల్యూ) చైర్మెన్‌ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఏ అజీజ్‌, ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి జీ తిరుపతయ్య, ఆలిండియా డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఏఐడీఈఎఫ్‌) రాష్ట్ర నాయకులు గోపాలకృష్ణ, తిరుపతి, రంజిత్‌గౌడ్‌, తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) ప్రధాన కార్యదర్శి చావ రవి, తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) అధ్యక్షులు అశోక్‌బాబు, డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరరేషన్‌ (డీటీఎఫ్‌) అధ్యక్షులు ఎమ్‌ సోమయ్య తదితరులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా పాత పెన్షన్‌ సాధన కోసం ఉద్యమం నడుస్తున్నదనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీనిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వామపక్షపార్టీలు మొదటి నుంచీ పాత పెన్షన్‌ విధానానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు. ఇటీవలికాలంలో ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు జరుపుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. నూతన పెన్షన్‌ స్కీంను తెచ్చిన కాంగ్రెస్‌పార్టీ కూడా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లో పునరాలోచన చేసి, పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ సీసీజీ ఈడబ్ల్యూ, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ (ఏఐఎస్‌జీఈఎఫ్‌) గతేడాది డిసెంబర్‌లోనే పిలుపునిచ్చిం దన్నారు. దానిలో భాగంగా పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయనీ, వాటన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ప్రకటించాల్సి ఉందన్నారు. దానికి సన్నాహకంగానే రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేశామ న్నారు. దీనిలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొ నాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సు పోస్టర్‌ను విడుదల చేశారు. ఐక్య రాష్ట్రస్థాయి సదస్సులో పై సంఘాలతో పాటు బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ), తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసి యేషన్‌ (టీఎస్‌పీటీఏ), తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఆర్‌టీఎఫ్‌), స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ తెలంగాణ స్టేట్‌ (ఎస్‌టీఎఫ్‌టీఎస్‌), బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ (బీటీఎఫ్‌), తెలంగాణ ఎస్సీ ఎస్టీ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఎస్సీఎస్టీటీఎఫ్‌), తెలంగాణ స్టేట్‌ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌ఎమ్‌ఎస్‌టీఎఫ్‌), ట్రైబల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీటీఏ), ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ స్టేట్‌ (ఎస్సీఎస్టీయూఎస్‌టీఎస్‌), మజ్లిస్‌ టీచర్స్‌ యూనియన్‌ (ఎమ్‌టీయూ)లు కూడా భాగస్వామ్యమవుతాయని తెలిపారు.

Spread the love