నూతన టెక్నాలజీ అమలులో ఆహార భద్రత అంశం కీలకం

– తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి
ఎం.రఘునందనరావు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీలని అమలు చేసేటప్పుడు ఆహార భద్రత అంశాన్ని దష్టిలో పెట్టుకోవాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంఛార్జి ఉప కులపతి ఎం.రఘునందనరావు తెలిపారు. హరిత విప్లవం దేశంలోని అనేక రంగాలు స్వయం సమృద్ధిని సాధించి ముందుకెళ్ళడానికి కారణమైందని వివరించారు. మొక్కల ఆరోగ్య యాజమాన్యం-ఆవిష్కరణ, సుస్థిరత అన్న అంశంపై నాలుగు రోజుల పాటు సాగే అంతర్జాతీయ సదస్సుని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రారంభించారు. శాస్త్రవేత్తలు ఏ అవిష్కరణ, పరిజ్ఞానాన్ని అందుబాటు లోకి తీసుకొచ్చినా ఆహార భద్రత అంశాన్ని మర్చిపోకూడదని ఆయన స్పష్టం చేశారు. భూసార క్షీణత, నీటి కాలుష్యం వంటి ప్రధాన సవాళ్ళని నేడు ఎదుర్కొంటున్నామని రఘునందనరావు వివరిం చారు. అదే విధంగా రైతులకి సరైన సమాచారం చేరకపోవడం వల్ల ఎరువులు, పురుగుమం దుల వినియోగం అధికమైందని దీనిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని సూచించారు. జీవ ఎరువులు, ప్రెసిషన్‌ వ్యవసాయ పద్ధతులకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వాతావరణ మార్పులు, ఎరువులు, పురుగుల మందుల అధిక వినియోగం వల్ల మానవ, మొక్కల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ ఆర్‌.శారద జయలక్ష్మీదేవి అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణకి తోడ్పడే విధానాలు, టెక్నాలజీల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని,నూతన వంగడాలని రూపొందించాలని ఆమె సూచించారు. ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పడి 50 ఏండ్లు అయినా సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపర్చినవారికి పురస్కారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ అదనపు డైరక్టర్‌ జనరల్‌ సునీల్‌ చంద్ర దూబే, ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండి యా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బి.శరత్‌ బాబు, ధనూక అగ్రిటెక్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ఆర్‌.జి.అగర్వాల్‌, శ్రీ బయోటెక్‌ ఈస్థటిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ డాక్టర్‌ కె.ఆర్‌.కె రెడ్డి, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు, శాష్త్రవేత్తలు, విద్యార్థులు, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు.