చైతాలి దాస్… చిన్నతనం నుండి ఖైదీలను చూస్తూ పెరిగింది. మొదట్లో వారు భయంకరమైన వ్యక్తులుగా ఆమెకు కనిపించారు. వయసు పెరిగే కొద్దీ వారూ సాధారణ మనుషులే అని గ్రహించింది. పేదరికం, అవకాశల లేమి వారిని నేరస్థులుగా మార్చిందని తన అధ్యయనంలో తెలుసుకుంది. అందుకే ఖైదీలకు, మహిళలకు, పిల్లలకు సాధికారత కల్పించడం తన బాధ్యతగా భావించింది. దీని కోసమే ‘జూట్ స్టోరీ బియాండ్ బార్స్’ను ప్రారంభించింది. ఆమె చేసిన ఈ చిన్న ప్రయత్నం ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిందో, ఎందరిలో మార్పు తెచ్చిందో మనమూ తెలుసుకుందాం…
చైతాలి దాస్‌కు తన ఐదేండ్ల వయసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన తన తండ్రితో కలిసి కోర్టు గదిని సందర్శించడం తొలి జ్ఞాపకాలలో ఒకటి. అక్కడ ఓ పోలీసు వ్యాన్ నుండి నేరారోపణలకు పాల్పడిన వ్యక్తులు దిగుతుంటే చూసింది. వారి చేతులకు బేడీలతో పాటు, నడుము చుట్టూ మందపాటి తాడు కట్టి వుంది. ఆశ్చర్యానికి గురై ఆ వ్యక్తుల గురించి తన తండ్రిని అడిగింది. నిందితులు పోలీసు వ్యాన్ నుండి దిగడంతోనే వారి కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ వారి వద్దకు వచ్చారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఆ కుటుంబాల వేదన, బాధ చైతాలీని తీవ్ర ప్రభావానికి గురి చేశాయి. ‘ఈ ఖైదీలు భయంకరమైన వ్యక్తులని అనుకున్నాను. అయితే వారు కూడా మార్పు వచ్చే సాధారణ మానవులే అని ఎదుగుతున్నప్పుడు తెలుసుకున్నాను’ అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు.
మహిళల సాధికారత కోసం
శిక్షాకాలం ముగిసిన తర్వాత కూడా జీవితకాలం ఆ కళంకాన్ని భరించాల్సిన ఖైదీల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని చైతాలి 2016లో ‘జూట్ స్టోరీ బియాండ్ బార్స్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది మహిళల సాధికారత కోసం పని చేసే రక్షక్ ఫౌండేషన్ కింద ప్రారంభించబడింది. ఖైదీల నైపుణ్యం, జీవనోపాది,ó అభివృద్ధి, సామాజిక చేరిక, పర్యావరణ పరిరక్షణ దీని ముఖ్య ఉద్దేశం. పునరావాసం, జీవనోపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఖైదీలు, ఇతర వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇది మొదట కేవలం శిక్షణా ప్రాజెక్ట్‌గా ప్రారంభించినప్పటికీ 2021 నాటికి ఇది పూర్తి స్థాయి స్టార్టప్‌గా పరిణామం చెందింది. ‘రూట్ టు జ్యూట్ ద్వారా ఖైదీలు గౌరవంగా బతికేందుకు జీవనోపాధిని కల్పించాలి. దీని కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాను’ అని ఆమె పంచుకున్నారు.
మేకింగ్ ఆఫ్ ది జ్యూట్ క్వీన్
పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌లో పుట్టి పెరిగిన చైతాలి ఇల్లు అలీపూర్ సెంట్రల్ జైలు, ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్ మధ్య ఉంది. సమీపంలోని పోలీసు స్టేషన్ నుండి విచారించబడుతున్న వ్యక్తుల అరుపులు విన్నట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. జైలుకు సమీపంలో పెరిగిన ఆమె జైలు ప్రపంచం గురించి చాలా అధ్యయనం చేశారు. ఇదే ఖైదీల పట్ల ఆమెకు సానుభూతిని పెంపొందించడానికి సహాయపడింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆమె కార్పొరేట్ ప్రపంచంలోకి ప్రవేశించారు. కొంత కాలం తర్వాత తన కుటుంబాన్ని చూసుకుంటూ స్టాక్ మార్కెట్‌లో కొనసాగారు. ప్రస్తుతం 50 ఏండ్ల చైతాలి సామాజిక కార్యక్రమాల్లో భాగం కావాలని కోరుకుంటున్నారు. తన తల్లి నుండి ఆమె ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నారు. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. భర్త కూడా ఆమెకు మద్దతు ఇస్తున్నారు.
రక్షక్ ఫౌండేషన్ ద్వారా…
ఎన్నో ఏండ్లుగా ఆమె అనేక ఎన్‌జీఓలతో కలిసి పనిచేశారు. 2014లో రక్షక్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఇది ఖైదీలు, నిరుపేదలకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొదట్లో ఖైదీలకు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు అందించింది. నెమ్మదిగా కుకీ మేకింగ్, యోగాను పరిచయం చేశారు. తర్వాత చెక్క పని, పెయింటింగ్‌లో శిక్షణ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లు ఆరు నెలల నుండి ఏడాది పాటు కొనసాగేవి. అన్ని ప్రాజెక్ట్‌లలో ‘జూట్ స్టోరీ బియాండ్ బార్స్’ ఆమెను ఎంతగానో ఆకర్షించింది. తర్వాత కాలంలో ఇది పూర్తి స్థాయి వ్యాపారంగా మారింది. ‘నేను మహిళలు, పిల్లల కోసం పని చేయాలని భావించాను. అయితే మొదట్లో నా పనిని చాలా మంది పెద్దగా మెచ్చుకోలేదు. ఖైదీలను మార్చడం అసాధ్యమని ప్రజలు నమ్ముతారు. ఇలాంటి అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ నేను ముందుకు వెళ్లాను’ ఆమె చెప్పారు.
స్థిరమైన వ్యాపారంగా…
ఖైదీలకు శిక్షణ అందించేందుకు ఆమె నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్‌జేబీ)తో కలిసి పనిచేశారు. 45 రోజుల పాటు సాగే ఈ శిక్షణా కార్యక్రమాన్ని మొదట డమ్ డమ్ సెంట్రల్ కరెక్షనల్ హోంలో నిర్వహించారు. తర్వాత అలీపూర్ సెంట్రల్ జైలు, ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో శిక్షణా సమావేశాలు జరిగాయి. జైలు అధికారులు యంత్రాలను అందించగా చైతాలి ముడిసరుకుతో పాటు శిక్షకులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సెషన్లలో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లలో పెట్టారు. వచ్చిన డబ్బు ఖైదీల ఖాతాలో జమ చేశారు. తర్వాత కాలంలో జనపనార వస్తువులను ఉత్పత్తి చేయిస్తూ వారికి సాధికారత కల్పించడానికి శిక్షణా సెషన్‌లను అందించాలనే ఆలోచన వచ్చింది. అయితే అప్పట్లో పూర్తి స్థాయిలో శిక్షణా సెషన్‌లు ఏర్పాటు చేసి దీన్ని ఓ స్థిరమైన వ్యాపారంగా మార్చడానికి వారి వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. దాంతో అప్పటి శిక్షణ వారికి సరిపోలేదు. కనుక 2021లో చైతాలి భారత ప్రభుత్వంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ పార్క్ ద్వారా స్టార్టప్‌ను పొందారు. రెండేండ్ల తర్వాత ఆ కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఆఫ్‌లైన్ స్టూడియోను కూడా ప్రారంభించారు.
ఆర్థిక సమస్యలతోనే…
చైతాలి నేరస్థులను అంటిపెట్టుకొని ఉన్న కళంకాన్ని తొలగించాలనుకుంటున్నారు. శిక్ష ముగిసిన తర్వాత కూడా నేరస్థులను అదే దృష్టితో సమాజం చూస్తుందని ఆమె అంగీకరించారు. ప్రజల అభిప్రాయాలను మార్చడంలో వృత్తి శిక్షణ ఒక మంచి పాత్ర పోషిస్తుందని ఆమె దృఢంగా విశ్వసించారు. ‘వృత్తి శిక్షణలో పాల్గొనడం ద్వారా ఈ ఖైదీల పట్ల ప్రజల అవగాహనలు మార్చే అవకాశం ఉంటుంది. అలాగే జీవనోపాధిని పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు వారికి అందుతాయి’ అని ఆమె చెప్పారు. పేదరికంతో కనీస వనరులు అందుబాటులో లేకపోవడం వల్లనే వారు నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అభిప్రాయం. సమాజంలో సమగ్రమైన, సహాయక వాతావరణం పెంపొందించగలిగితే నేరాలను నిరోధించడం సులభమని ఆమె అంటున్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు
భారతదేశం జనపనారను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. అయినా అది పెద్దగా ఉపయోగంలో లేదు. పైగా దాని ఉత్పత్తులను అందరూ పాతవిగా భావిస్తున్నారు. అందుకే మరచిపోయిన జనపనారను పునరుద్ధరించాలని ఆమె భావించారు. ఇప్పుడు జనపనారతో హస్తకళలు, రగ్గులు, బట్టలు, హ్యాండ్‌బ్యాగ్‌లు వంటివి ఉత్పత్తి చేస్తున్నారు. వీటి ధర రూ. 100 నుండి మొదలై రూ. 5,000 వరకు ఉంటుంది. ఆమె ఫౌండేషన్ 2021న ప్రపంచంలోనే అతి పెద్ద జనపనార సంచిని ఉత్పత్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. ఆ బ్యాగ్ 30.68 మీటర్ల వెడల్పు, 24.87 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇప్పటివరకు ఆమె బృందం కోల్‌కతాతో పాటు చుట్టుపక్కల 2,000 మంది ఖైదీలు, 15,000 మంది నిరుపేద మహిళలకు జనపనార ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో శిక్షణ ఇచ్చారు. కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు కూడా జ్యూట్ ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించారు.
– సలీమ